ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలకు వివరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసపాలన సాగుతోందని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ ప్రజలు ఎవరూ ఆనందంగా లేరని ఆమె అన్నారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో సోమవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బిజెపి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలకు సంబంధించిన 27 ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన ఘనత సిఎం జగన్‌కు దక్కుతోందని అన్నారు. సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి పట్టించారని, దళిత సంక్షేమాన్ని పూర్తిగా జగన్ ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. బిసి కమిషన్‌కు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినా, రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని అన్నారు. బిసి సంక్షేమాన్ని పట్టించుకోకుండా అబద్ధపు హామీలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు, మైనార్టీలకు ఏమి చేశారని సామాజిక సాధికారత బస్సు యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. సామాజిక సాధికారత బస్సుయాత్ర చేసే నైతిక హక్కు వైసిపి నేతలకు లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన అద్భుతమని, ఏ ప్రభుత్వం చేయలేని, సాహసించలేని పనులకు బిజెపి శ్రీకారం చుట్టిందని అన్నారు. 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును పాస్ చేసిన ఘనత మోడీకి దక్కుతుందని అన్నారు. అదే విధంగా మాదిగల చిరకాల కోరిక ఎస్‌సి వర్గీకరణకు మోడీ అండగా నిలిచారన్నారు. పార్టీలో ఉన్న సామాన్య కార్యకర్తకు కూడా బిజేపి ప్రాధాన్యత ఇస్తుందని, కుటుంబ రాజకీయ పార్టీలకు స్వస్తి చెప్పి అవినీతి రహిత పాలన అందిస్తున్న బిజెపిని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు. ఆ దిశగా జిల్లా నాయకత్వం గ్రామస్ధాయిలో పని చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దీంతో బిజెపి గ్రామస్థాయి లో పుంజుకుంటుందని తెలిపారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి, శివప్రకాష్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహారావు, సిఎం రమేష్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు.