Jun 15,2023 20:26

కిట్లను అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

ప్రజాశక్తి - మంత్రాలయం
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ, ఆణిముత్యాల ప్రోత్సాహకాల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసిపి నేత వై.సీతారామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పది, ఇంటర్‌ పరీక్షల్లో కోసిగి మండలం అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వంలో శిథిలావస్థకు చేరిన మురుగుదొడ్లు, చాలీచాలని పాఠ్య పుస్తకాలతో కాలం గడపాల్సి వచ్చేదని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నాడు-నేడుతో పాఠశాలల రూపు రేఖలు మార్చేశారని చెప్పారు. విద్యతో పాటు వైద్య రంగంలో కూడా మార్పులు చేపట్టారని తెలిపారు. గతంలో పిహెచ్‌సిలకు ప్రస్తుతం ఎంతో తేడా ఉందని గుర్తు చేశారు. అనంతరం పది, ఇంటర్‌ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులు రిజ్వాన, మానస, అఫ్రజ్‌ భాను, జానకి, రాధమ్మ, నరసింహులు, అక్షయకు రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల నగదు పారితోషికం అందజేసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను సన్మానించారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజ్‌, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, ఉప సర్పంచి హోటల్‌ పరమేష్‌, ఎంపిటిసి వెంకటేష్‌ శెట్టి, ఛైర్మన్‌ సాబ్జల్లి, ఎంఇఒ మోహనుద్దీన్‌, హౌసింగ్‌ డిఇ లాల్‌ కృష్ణయ్య, కోసిగి ఎపి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సమీరా రెడ్డి పాల్గొన్నారు.