రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం జగన్ : రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ
ప్రజాశక్తి- రేపల్లె
రాష్ట్రంలో నూతన పాలనా విధానాన్ని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలులోకి తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. మండలంలోని వడ్డీవారిపాలెంలో రూ.50లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం క్రింద రూ.15లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లును ఆయన శనివారం ప్రారంభించారు. మునుపెన్నడూ లేని విధంగా నవరత్నాల పేరుతో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందే రీతిలో పరిపాలన చేస్తున్నారని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అన్ని సంక్షేమ పథకాలను ముందుగా పేర్కొన్న క్యాలెండరు ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. పేద ప్రజలను సంక్షేమ పధకాలతో ఆదుకోవడం ప్రతిపక్ష పార్టీలకి నచ్చడం లేదని అన్నారు. దీంతో ప్రభుత్వంపై లేనిపోని అపనిందలు వేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్‌ను ప్రజలు ఆశీర్వాదించాలని కోరారు. జగనన్న గృహ సారధులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి పనిచేస్తే 2024లో మరోసారి జగన్ సిఎం అవటం ఖాయమన్నారు. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అందిన సంక్షేమ పథకాల వివరాలతో ప్రతి ఇంటిని సందర్శిస్తున్నామని అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లిఖార్జునరావు, రేపల్లె రూరల్ వైసిపి కన్వీనర్ గాదె వెంకయ్య బాబు, వడ్డీవారిపాలెం సర్పంచ్ సునీత శ్రీనివాసరావు, బొందలగరువు ప్రెసిడెంట్ లక్ష్మీ ప్రసన్న, కోట జస్వంత్ పాల్గొన్నారు.










