ప్రజాశక్తి-రేపల్లె: రాష్ట్రంలో నూతన పాలనా విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమలులోకి తీసుకొచ్చారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. శుక్రవారం రేపల్లె మండలంలోని పేటేరు గ్రామంలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టీనా, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు పారదర్శకంగా పాలన అందించడానికి ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. రాష్ట్రంలో పేద ప్రజలకు అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వం లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రేపల్లె మండలం లోని పేటేరు గ్రామంలో గత నాలుగు సంవత్సరాల్లో రూ.4.28 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేశామన్నారు. పేటేరు గ్రామంలో వివిధ రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.28 కోట్లను ప్రభుత్వం ప్రజలకు అందించిందని పేర్కొన్నారు. గ్రామంలో చేసిన అభివృద్ధిలను గుర్తించుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వాని అండగా ఉండాలని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టినా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల భద్రత కోసం 5,388 మంది కాపలాదారుల పోస్టులు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేయడం వల్ల గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారన్నారు. ఫెయిల్ అయిన 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ అనే పుస్తకాలను రూ.70 లక్షలతో తయారు చేసి పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు అదనపు పౌష్టికాహారం అందించామన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణతో కూడిన విలువలు నేర్పాలని పేర్కొన్నారు. బాలికలకు18 సంవత్సరాలు నిండే వరకు వివాహం చేయవద్దన్నారు. పిల్లలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా పేటేరు గ్రామంలో 75 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని మరియు 21 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 31.59 లక్షల రూపాయలతో నిర్మించిన క్లస్టర్ భవనాన్ని, నాడు నేడు కింద 60 లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం కింద రూ.40 లక్షల రూపాయలతో నిర్మించిన 6 సిమెంట్ రోడ్లును రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, జిల్లా పరిషత్ చైర్మన్ క్రిస్టినా, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, రేపల్లె ఎంపీపీ సుధా చంద్రహాసన్‌రావు, నిజాపట్నం ఎంపీపీ హరినాథ్, గ్రామ సర్పంచ్ కనపర్తి వసుమతి వైసిపి పేకేరు ఇన్‌ఛార్జి కనపర్తి రవికిరణ్ మండల ఉపాధ్యక్షురాలు రావు నెహ్రూ లక్ష్మి కుమారిరావు, ప్రభాకర్‌రావు, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.










