
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసిపి సామాజిక సాధికార బస్సుయాత్ర శనివారం నిర్వహించారు. మధ్యాహ్నం 2:45 గంటలకు సంగడిగుంట వైఎస్సార్ విగ్రహం నుంచి బీఆర్ స్టేడియం మీదుగా తొలుత బస్సు యాత్ర కొనసాగింది. అనంతరం మాయాబజార్ మెయిన్ రోడుపై బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగో పాలకృష్ణ, ఎంపిలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యేలు మద్దాల గిరి, ముస్తాఫా, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మంత్రి నాగార్జున మాట్లా డుతూ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరతీసిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అని మంత్రి అన్నారు. చంద్రబాబు హయాంలో వెలివేతలు, అవమానాలు, మోసాలను చూశామని, కానీ వైసిపి సంక్షేమ పాలనే ప్రజలు చూస్తున్నార న్నారు. మంత్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ నిజాలు మాట్లాడే జగన్ ముందు చంద్ర బాబు ఆటలు సాగవన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఏకం కావాలని ఐక్యంగా సీఎం జగన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ దాదాపు రూ.2.31 లక్షల కోట్లను డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమం రూపంలో జగన్ అందించారన్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను నమ్మి మోస పోవద్దని అన్నారు. కార్యక్రమంలో వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.