Oct 07,2023 22:06

రిలేదీక్షలో మాట్లాడుతున్న కందికుంట వెంకటప్రసాద్‌

      కదిరి టౌన్‌ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని, అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్‌ విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ 27వ రోజు కదిరి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం వద్ద రిలేదీక్షలు కొనసాగాయి. చంద్రబాబుకు మద్దతుగా బంజారా సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వారి దీక్షలకు టిడిపి కందికుంట సంఘీభావం తెలిపి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు అరెస్టును రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు నిర్దోషిని, ఆయన లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్‌ చేసి వచ్చే ఎన్నికల్లో జగన్‌ గెలవాలని చూస్తున్నారన్నారని, ఇది అంతసులవు కాదన్నారు. దొంగ ఓట్లు, టిడిపి మద్దతుదారుల ఓట్ల తొలగింపు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యవంతంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సంఘం, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.