Oct 21,2023 21:12

ప్రజాశక్తి-వేపాడ : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ తెలిపారు. మండలంలోని అంకాజోష్యులపాలెంలో తన నివాసం వద్ద శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాలను ఎన్నికల ముందు ఏ విధంగా మోసపూరితమైన హామీలను ఇచ్చి అధికారం చేజిక్కించుకున్నారో ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. రాజధాని అమరావతి పూర్తిస్థాయిలో నిర్మాణం జరగాలంటే 50 వేల ఎకరాలు అవసరం ఉంటుందని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలిపారని గుర్తుచేశారు. తాను అధికారంలోకి వస్తే అమరావతిని ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ప్రకటించారన్నారు. తీరా వైసిపి అధికారంలోకి వచ్చా విధ్వంసమే తప్ప ఎక్కడా అభివృద్ధి జాడ లేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖపట్నంలో రుషికొండను సర్వనాశనం చేసి, ప్రజాధనం వెచ్చించి విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకుంటున్నారని తెలిపారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సెంటున్నర భూమినిచ్చి, లక్షల ఇళ్లు నిర్మిస్తున్నానంటూ సిఎం జగన్‌ సొంత పత్రికల్లో ప్రకటించుకుంటున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన ఏ విధంగా సాగుతున్నారో, ప్రజల సొమ్మును ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం చేసుకోకపోతే మన పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేసుకున్న వారవుతామని ఆందోళన వ్యక్తంచేశారు.