Aug 04,2023 20:17

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై దాడికి నిరసనగా ధర్నా నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ ఎమ్మెల్యే
ప్రజాశక్తి - బనగానపల్లె

      రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వైసిపి నాయకులు అపహాస్యం, ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన దాడికి నిరసనగా శుక్రవారం పట్టణంలోని పాత బస్టాండ్‌ కూడలిలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో చంద్రబాబుపై, టిడిపి నాయకులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసిపి రౌడీలు, గుండాలతో రాళ్లు వేయించడం, దాడులకు పాల్పడడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైసిపి పాలనకు పతనం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని రౌడీయిజంతో అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు రౌడీయిజంతో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలన్నారు. లేకపోతే తాము కూడా తిరిగి దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసిపి నాయకులు రాష్ట్రం విడిచి పారిపోవాల్సి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు బొబ్బల గోపాల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పవన్‌ కుమార్‌ రెడ్డి, నాయకులు వెంకటరామిరెడ్డి, హుస్సేనాపురం జాంగీర్‌, సైకిల్‌ షాప్‌ బేగ్‌, షబ్బీర్‌, మదన భూపాల్‌ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.