Sep 19,2023 22:28

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌

        పుట్టపర్తి అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియంతలా మారి రాష్ట్రంలో పోలీస్‌ పాలన సాగిస్తున్నారని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. మంగళవారం పట్టణంలోని సాయి ఆరామంలో 'ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలపై రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్బంధాలు అరెస్టులు, అణచివేత'పై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, టిడిపి కన్వీనర్‌ రామాంజనేయులు, జనసేన జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలను అణచివేయడమే ధ్యేయంగా జగన్‌ ఒక నియంతల వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకులను నొక్కి వేస్తూ అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టిడిపి అధినేత చంద్రబాబును అక్రమ అరెస్టు ఇందులో భాగమే అన్నారు. 27 లక్షల దొంగ ఓట్లు నమోదు చేసి గెలవాలని వైసిపి చూస్తోందన్నారు. రాష్ట్రంలో ఇసుక, భూకబ్జా, మద్యం లాబీలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్‌లో జరిగిన ధమనకాండపై ప్రధాని మోడీతో సహా బాధ్యత గల నాయకులు ఎవరూ స్పందించలేదన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాసంఘాల చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులతో అణచి వేయిస్తూ దుర్మార్గపు సంస్కృతికి తెరతీస్తున్నారన్నారు. ఇలాంటి దమనకాండను ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సామకోటి ఆదినారాయణ, శ్రీరామ్‌ రెడ్డి, జనసేన డాక్టర్‌ తిరుపతేంద్ర, సిఐటియు రైతు సంఘం నాయకులు బ్యాళ్ల అంజి, పైపల్లి గంగాధర్‌, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు, రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాటమయ్య, గంగాధర్‌, రమణ, ఎస్‌ఎఫ్‌ఐ పవన్‌, కుళ్లాయప్ప, మహిళా సమైక్య నుంచి పవిత్ర, లక్ష్మి, ఆదిలక్ష్మి, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.