Sep 06,2023 20:42

మాట్లాడుతున్న మాజీమంత్రి సోమిరెడ్డి

మాట్లాడుతున్న మాజీమంత్రి సోమిరెడ్డి
రాష్ట్రంలో పెరిగిపోతున్న టెర్రరిజం
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
ప్రజాశక్తి-నెల్లూరు:వైసిపి పాలనలో రాష్ట్రంలో స్టేట్‌ టెర్రరిజం పెరిగిపోయిందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫైయర్‌ అయ్యారు. బుధవారం ఆయన నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నారాలోకేష్‌ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు తిరిగి మావాళ్ల పైనే కేసులు బనాయిస్తున్నారని, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు కాన్వారు పై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తమ్ముడు ఆధ్వర్యంలో దాడికి పాల్పడ్డారన్నారు.
200 రోజుల పాటు సవ్యంగా యువగళం పాదయాత్ర సాగిందన్నారు. లోకేష్‌ బాబుకు రక్షణగా ఉన్న వలంటీర్లు, కార్యకర్తలు మరొకరి జోలికి పోయే ప్రసక్తే లేదన్నారు. వైసిపి వాళ్లే మా కార్యక్రమాల దగ్గరకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు..దాడులు జరుపుతున్నారని ఆరోపించారు. టిడిపి కార్యకర్తలపై దాడి చేసి తిరిగి మావాళ్లలోనే 400 మందికి పైగా అక్రమ కేసులు బనాయించారు. వైసీపీ కార్యకర్తల్లో ఒక్కరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. ఇప్పటికి 160 మందిని నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లతో అరెస్టు చేశారని, అంతటితో ఆగకుండా ఎఫ్‌ఐఆర్‌ లో ఇతరులు అని పేర్కొని ఏ రోజుకి ఆ రోజు కొత్త పేర్లు యాడ్‌ చేసుకుంటూ పోతున్నారన్నారు.
పోలీసులు, వైసీపీ నేతల తీరుతో వెయ్యి మందికి పైగా ఊళ్లు వదిలిపెట్టిపోయే పరిస్థితి నెలకోందన్నారు.
ఇప్పుడు బేతంపూడిలో యువగళం పాదయాత్ర సారథి లోకేష్‌ బాబుకు రక్షణగా వలంటీర్లపై కక్షకట్టారని,మా వలంటీర్ల వద్ద కర్రలు లేవు, కత్తులు లేవు, రాడ్లు లేవు, చివరకు పేనా కత్తులు(కోడికత్తి) లేవని, అయినా యువగళం క్యాంప్‌ పై అర్థరాత్రి పోలీసులు దాడి చేసి వలంటీర్లను దౌర్జన్యంగా లాక్కెళ్లడం ఎంత వరకు న్యాయమన్నారు.చంద్రబాబు నాయుడు, లోకేష్‌ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలేక పోలీసుల సాయంతో స్టేట్‌ టెర్రరిజానికి దిగారన్నారు.చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా స్టేట్మెంట్‌ ఇవ్వలేదని పుంగనూరు ఇన్‌ చార్జి చల్లా బాబును తెల్లవార్లు స్టేషన్‌ లో పెట్టారన్నారు.వైసీపీ నేతలు చెప్పినట్టు పోలీసులు ఎన్ని తప్పుడు పనులు చేసినా చివరకు జగన్‌ రెడ్డి చేతిలో వారికి భంగపాటు తప్పదన్నారు.రాష్ట్ర ప్రభుత్వమే ఒక క్రిమినల్‌ గా, ఉగ్రవాదిగా వ్యవహరిస్తుండటం దురదష్టకరమని,రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.వందల కోట్లు దోపిడీ చేస్తున్న కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మా నాయకులపై విమర్శలు చేయడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. రైతులకు 24 గంటలూ ఉచితంగా కరెంట్‌ ఇస్తున్న తెలంగాణలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్టు మీటర్లు బిగించలేదు..ఏపీలో మాత్రం స్మార్ట్‌ మీటర్ల ముసుగులో భారీ అవినీతికి తెరలేపారని,వీరి అక్రమాలను ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు.సంగంలో వలంటీర్లు, బీఎల్వోలతో మీటింగులు పెట్టి మరీ టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తుంటే జిల్లా ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి అండగా నిలుస్తునర్న అధికారులకు ఎన్నికల కమిషన్‌ చేతిలో భంగపాటు తప్పదని హెచ్చరించారు.