Oct 02,2023 00:34

టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ

ప్రజాశక్తి - గుంటూరు : రాష్ట్రంలో నేరస్తులు స్వైరవిహారం చేస్తున్నారని, బడుగు, బలహీన వర్గాలను జగన్‌ ముఠా చంపుకుతింటోందని టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు మన్నవ మోహనకృష్ణ విమర్శించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్‌గౌడ్‌ అనే పదో తరగతి విద్యార్థిని వైసిపి నేతల ప్రోద్బలంతో కొందరు హత్యచేయగా ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసి మానేసిన సుబ్రహ్మణ్యంను కొట్టి చంపారని అన్నారు. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్‌ అనంతరం ఆ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. ఆయా ఘటనల్లో మృతుల కుటుంబీకులు ఆవేదనతో, ఆర్తనాదాలు చేస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే హంతకులు మాత్రం డాన్సులు చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. అమర్నాథ్‌ గౌడ్‌ హత్యకేసులో నిందితుడు వినాయక చవితి ఉత్సవాల్లో డ్యాన్సులు వేస్తూ కనిపించగా మరో నిందితుడు పాము వెంకటేశ్వరరెడ్డి బెయిల్‌పై బయటకొచ్చి, బాధిత కుటుంబంపై హత్యాయత్నం చేశాడని, ఎమ్మెల్సీ అనంతబాబును మొన్న జరిగిన వైసిపి ఎల్పీ సమావేశంలో పాల్గొన్నారని విమర్శించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు వెళ్తే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబను అక్రమంగా అరెస్టు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కు నెట్టింది కాకా 'మళ్లీ జగనే కావాలి' అంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మోహనకృష్ణ దుయ్యబట్టారు.