ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రాష్ట్రంలో సిఎం జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందని తెలుగు మహిళలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న దుష్ట పాలన అంతం కావాలని కోరుతూ గురువారం తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి ఆధ్వర్యంలో తెలుగు మహిళలు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వసంతమహల్ సెంటర్‌లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన ప్రదర్శన పాతబస్టాండ్ సెంటర్ వరకూ సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ, జిల్లా అధికార ప్రతినిధి కడియాల విజయలక్ష్మి, నగర అధ్యక్షులు తవ్వా అరుణకుమారి, కార్యదర్శి పిళ్లారిశెట్టి సంధ్య మాట్లాడుతూ కీర్తిశేషులు ఎన్‌టి.రామారావు మహిళల సంక్షేమానికి పెద్దపేట వేశారని, చంద్రబాబు మహిళల ఆర్థిక, సామాజిక ప్రగతి సాధించేందుకు బాటలు వేశారని తెలిపారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ రోజు చూసినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, అరాచకాలు జరుగుతున్నా నిందితులకు శిక్ష పడటం లేదని, బాధితులే శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలన అంతమయ్యేవరకూ పోరాడుతామని హెచ్చరించారు.










