
రాష్ట్రంలో కరువు విలయతాండవం
ప్రజాశక్తి - కావలి రూరల్ : రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి దామా అంకయ్య మండిపడ్డారు. ఆదివారం కావలి జర్నలిస్టు క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటాయని గత సంవత్సరమే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. రైతులకు సూచనలు చేయడం పంటలు మార్పు చేయకపోవడం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించలేక పోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్రంలో 444 మండలాలు కరువు మండలాలుగా ఉండగా సిపిఐ పోరాట ఫలితంగా 107 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటింటినట్లు తెలిపారు. కరువు మండలాలుగా ప్రకటించిన వాటిలో నెల్లూరు జిల్లాలో ఒక్క మండలం కూడా లేకపోవడం కడు శోచనీయమన్నారు. జిల్లాలో 35 మండలాల్లో 50 శాతం లోపే వర్షపాతం నమోదైందన్నారు. చంద్రబాబుపై పెట్టే శ్రద్ధను కాస్త తగ్గించి రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై దృష్టి పెట్టాలన్నారు. చంద్రబాబు హయాంలో వర్షాలు పడవని జగన్ చెప్తూ ఉండేవారని, కాబట్టి తన కాలంలోనూ పడలేదని చెప్తే ఆ నింద తన పైకి వస్తుందని వర్షాలు పడకపోయినా కూడా కరువు మండలాలుగా ప్రకటించాల్సిన వాటిని ప్రకటించకుండా చేస్తున్నారని అనిపిస్తునట్లుందన్నారు. రాష్ట్రంలోని 18 జిల్లాల్లో సిపిఐ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు పర్యటన జరుపుతున్నారని అందులో భాగంగా 10వ తేదీన జిల్లాలోని కరువు ప్రాంతాల్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, జగదీష్ పర్యటిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తన నానుడి వైఖరి విడనాడే వరకు పోరాడుతామని, వెంటనే కరువు మండలాలు ప్రకటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కొప్పొర్తి నాగరాజు పాల్గొన్నారు.