Jun 19,2023 02:19
మాట్లాడుతున్న రమాదేవి

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో రోజురోజుకూ దాడులు, అత్యాచారాలు, హత్యలు పెద్ద ఎత్తున పెరుగుతూ రాష్ట్రంలో శాంతి భద్రత లు గాడి తప్పుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి రమాదేవి ఆందోళన వ్యక్తం చేశారు. చెరుకుపల్లి మండలంలో దారుణ హత్యకు గురైన అమర్నాథ్‌ హత్య ఘటనపై బాపట్ల జిల్లా సిపిఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో డిజిపి దిశ చట్టం ద్వారా పెద్దఎత్తున కేసులు పరిష్కారం అవుతున్నట్లు గొప్పలు చెప్పటం సిగ్గుచేటన్నారు. దిశ పేరుతో 28 వేల కేసులు నమోదయ్యాయి. వాటిలో ఎఫ్‌ఐఆర్‌ అయినవి కేవలం 2 వేల 7 వందల కేసులు మాత్రమేనన్నారు. మిగిలిన కేసులన్నీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా కౌన్సెలింగ్‌ పేరుతో బాధితులకు న్యాయం చేయకుండా మభ్యపెడుతున్నారని, దిశ పేరుతో కేసులు పరిష్కారం అవుతున్నాయని డీజీపీ ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2020తో పోల్చుకుంటే 25 శాతం మేర ప్రతి ఏడాది దిశలో నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. అయితే నేర ప్రవృత్తి తగ్గుతుందని, మహిళలపై దాడులు తగ్గుతున్నాయని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. చెరుకుపల్లి మండలంలో పక్కా పథకం ప్రకారం విద్యార్థిని పెట్రోల్‌ పోసి కాల్చిచంపితే ఈ ఘటనను అక్కడ స్థానిక నాయకులు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారని, విద్యార్థి, యువజన, వివిధ ప్రజా సంఘాలు ఆందోళన చేస్తే తప్పని పరిస్థితుల్లో దోషులను అరెస్టు చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే ఫాస్ట్‌ ట్రాక్‌ కేసుగా పరిగణించి 21 రోజుల నుంచి 40 రోజుల్లోపు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే శిక్షలు వేస్తున్నారో అదేతరహాలో దోషులను శిక్షించాలన్నారు. చెరుకుపల్లి విద్యార్థి అమర్నాథ్‌ హత్య ఘటనలో నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే 21 రోజుల్లోపు దోషులకు శిక్ష పడేలాగా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా అదేదో దయతో ఇస్తున్నట్లుగా పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవడం సిగ్గు చేటన్నారు. తండ్రి లేని కుటుంబంలో అమర్నాథ్‌ కూడా చనిపోవడంతో తల్లి, అతని మీద ఆధారపడిన మరో మైనర్‌ బాలిక ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబ పోషణ కోసం భూమి సదుపాయం కల్పించి సోదరి చదువు బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకోవాలని అన్నారు. చదువు పూర్తయిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆ రకంగా కాకుండా అంగన్‌వాడీ ఉద్యోగం ఇస్తామని కళ్లనీళ్లు తుడిచే ప్రయత్నం చేయడమంటే చిత్తశుద్ధి లేకపోవడమేనని అన్నారు. ఇలాంటి ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తూ దోషులు బహిరంగంగా బయట తిరిగే అవకాశం కల్పిస్తే రాష్ట్రంలో అమర్నాథ్‌ హత్య లాంటి ఘటనలు పునరావృతమయ్యే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు కుటుంబాల తగాదా అని స్థానిక ఆర్డిఓ డిఎస్పి అక్కడ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ కేసును పక్కదో పట్టించడం మానుకోవాలని ఎప్పటి నుండో రాజోలు స్కూలుకు వెళుతున్న విద్యార్థులను వేధిస్తున్న ఘటనలు అక్కడ జరుగుతున్నప్పటికీ అవేమీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం అమర్నాథ్‌ సోదరి వేధింపులను అమర్నాథ్‌ హత్య ఘటనను రెండు కుటుంబాలకు పరిమితం చేయాలనుకుంటే సిపిఎం పార్టీగా చూస్తూ ఊరుకోదని చెరుకుపల్లి మండల వ్యాప్తంగా ఈ ఘటనను ప్రచారం చేసి దోషులకు శిక్షపడేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్‌ గంగయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్‌, సిహెచ్‌ మణిలాల్‌, సిహెచ్‌ మజుందార్‌, ఎన్‌ బాబురావు పాల్గొన్నారు.