
ప్రజాశక్తి-మార్టూరు రూరల్, పర్చూరు: నిలువ నీడలేని ఆంధ్రప్రదేశ్ కోసం అహౌరాత్రులు శ్రమించి, రాష్ట్రానికి దశ దిశ చూపి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపడం, రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమించడమే చంద్రబాబు చేసిన తప్పా అని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. సోమవారం మార్టూరు, పర్చూరు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. పలు కుటుంబాలను పరామర్శించి ఆయన ధైర్యం కల్పించారు. ఇటీవల మృతి చెందిన పలువురి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ.. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలతో అక్రమ కేసులో ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని ప్రపంచం మొత్తం తెలిసిపోయిందన్నారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలు ఈ అరాచక ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అరాచక అక్రమ దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఖాళీ కావడం ఖాయం అన్నారు.
రాష్ట్రంలో రాక్షస పాలన
బాపట్ల: రాష్ట్రంలో రైతు రాజ్యం తెస్తానని జగన్మోహన్‌రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు నిరసనగా నరేంద్రవర్మ ఆధ్వర్యంలో సోమవారం బాపట్ల టిడిపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సంఘీభావ రిలే నిరాహార దీక్షలో తెలుగు రైతు విభాగం నాయకులు దీక్షలో కూర్చుని సంఘీభావం తెలిపారు. వైసిపి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ రాక్షస రాజ్యం సాగిస్తోందని విమర్శించారు. జగన్మోహన్‌రెడ్డి పైశాచిక ఆనందం కోసం నిరాధారమైన కేసులో చంద్రబాబు పేరు ఇరికించి జైలుకు పంపారన్నారు. త్వరలోనే మచ్చలేని నాయకుడిగా జైలు నుంచి చంద్రబాబు బయటకు వస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారన్నారు. దీక్షలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, నరేంద్రవర్మ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
17వ రోజు టిడిపి నిరసన
కారంచేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపడం అన్యాయమని, వెంటనే ఆయనను విడుదల చేయాలని కోరుతూ కారంచేడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సోమవారం నిరసన దీక్షలు నిర్వహించారు. పర్చూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన నిరసన కార్యక్రమం 17వ రోజుకు చేరింది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబునాయుడును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంభంపాటి నరేంద్ర, పాతూరి ఆదిలక్ష్మి, పి వెంకటేశ్వర్లు, రామచంద్రరావు, పలేటి హరి, బోడావుల గన్, గాంధీ, చిట్టియ్య, పేర్ని ఆంజనేయులు, లావు శ్యామ్, సుబ్బయ్య, యార్లగడ్డ శ్రీలక్ష్మి, కొల్లా రమాదేవి, నువ్వుల కోటమ్మ, పేర్ని అంజన, పోతిని హైమవతి, కోడూరి చింపరమ్మ, పార్వతి, యార్లగడ్డ పద్మావతి, తాళ్లూరి అనిల్ కుమార్, కొల్లా భాస్కరరావు, బోయన శీను తదితరులు పాల్గొన్నారు.
'మేము సైతం బాబుతోనే' దీక్షలో గీత కార్మికులు
రేపల్లె: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే దీక్షలు 12వ రోజుకు చేరాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు కల్లు గీత కార్మికులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీత కార్మికుల నాయకులు చెన్ను నాగమల్లేశ్వరరావు మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో అనూహ్యరీతిలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ నియంతృత్వ పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని హెచ్చరించారు. ఈ మేరకు, మేము సైతం బాబుతోనే, టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్ అని, సైకో పోవాలి.. సైకిల్ రావాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీక్షలో టీడీపీ లీగల్ సెల్ నాయకులు వై ధర్మతేజ, వెనిగళ్ల సుబ్రమణ్యం, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.