ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రాన్ని రుణాంధ్ర ప్రదేశ్‌గా మార్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని టిడిపి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి తెలిపారు. రాష్ట్ర ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని, జగన్ పాలన ఉంటే మరో 20 ఏళ్లయినా ఈ అప్పులు తీరవని చెప్పారు. సోమవారం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు అప్పుల భారం నుంచి బయటకు రావాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడమే మార్గమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్షంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు బెదిరించడం తగదన్నారు. పోలీసులను పెట్టుకుని జగన్ పాలన చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబ సభ్యులను సిఐడి ద్వారా వేధించడం, కేసు పెట్టడం సమంజసం కాదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ల్యాండ్, శాండ్, మైన్, వైన్‌ను జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. మద్యం ఆదాయం మొత్తం జగన్ జేబులోకి పోతోందని తెలిపారు. గత నాలుగేళ్లలో రూ.41 వేల కోట్ల ఆదాయం జగన్‌కు చేరిందని చెప్పారు. బటన్ నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తానని చెబుతున్న జగన్ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. 6 లక్షల మంది వృద్ధులకు పింఛన్లు తొలగించారని, ఇక సంక్షేమ అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకపోగా భృతి కూడా ఇవ్వలేదన్నారు. కనీసం ప్రజలతో కలవడానికి కూడా వీలు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ వద్ద ఎప్పుడూ 144 సెక్షన్ అమలు చేయడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ.80 వేల కోట్లు బిల్లు ఇవ్వాలని, వాటిని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ ప్రజలతో మమేకమయ్యే వారని తెలిపారు. సొంత బాబాయిని హత్య చేయించిన రక్త చరిత్ర జగన్ కుటుంబానికి దక్కిందని చెప్పారు. ఈ కేసుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతి రెడ్డి, జగన్ అరెస్ట్ కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, ప్రజలకు మేలు జరగాలన్నా 2024 ఎన్నికల్లో టిడిపి విజయం సాధించాలని, మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని చెప్పారు. నాయకులు బుద్ధారెడ్డి, మాజీ కౌన్సిలర్ రంగన్న, వెంకటేష్, శివప్ప, శేషి రెడ్డి, లక్ష్మీనారాయణ, జయరాం, తిమ్మప్ప, సైదుల్లా, ఇంతియాజ్, అయ్యప్ప, మహ్మద్, జగదీష్, సజ్జాద్, మల్లి, వీరేష్, చిట్టి ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న భూపాల్ చౌదరి










