Nov 10,2022 00:00

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతిన సీతారాం అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడని ప్రధాని మోడీ ఏం మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద సిపిఎం మండల విస్తృత స్థాయి సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న సీతారాం మాట్లాడుతూ ఈ నెల 11,12 తేదీల్లో ప్రధాని మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో కార్మికులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వానికి అధికార వైసీపీ ప్రభుత్వం మోకరిల్లడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే, ప్రభుత్వానికి ఏటా లక్షలాది కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చే విశాఖ స్టీల్‌ ప్లాంటును అమ్మకానికి పెట్టిన బిజెపిని ప్రశ్నించాల్సిన వైసిపి ప్రభుత్వం దానికి వత్తాసు పలకడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకపోగా, మోడీ జపం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారన్నారు. ఈ సమస్యలపై సిపిఎం మాత్రమే నికరంగా నిరంతరం పోరాడుతుందని చెప్పారు.
రంపచోడవరం నియోజకవర్గంలో అభివద్ధి శూన్యమని, సరైన రహదారులు లేవని విద్య, వైద్యం, విద్యుత్‌, సాగునీరు, తాగునీరు వంటి సమస్యలు వెంటాడుతున్నాయని, అయినా వాటిని పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒపికి తగినన్ని మందులు లేవని, అంబులెన్సులు, వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం భవనాలు నిర్మాణాల పేరిట కోట్లాది రూపాయలు వృథా చేస్తుందని, ఆ డబ్బులు ఏజెన్సీలో మౌలిక వసతులకు ఖర్చు చేస్తే ఉపయోగకారంగా ఉంటాయని హితవుపలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేశాయని, వారిని నమ్మించి నట్టేట ముంచేశాయని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా నాయకులు ఎం.వాణిశ్రీ, మండల నాయకులు కొండ్ల సూరిబాబు, కె జగన్నాథం, టి శ్రీను, దొరబాబు, పి సత్యనారాయణ, రమేష్‌, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.