ప్రజాశక్తి- అనకాపల్లి
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని, రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేశారని టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీశ్వరరావు విమర్శించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీల అమలు చేయాలని, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని మాట్లాడవలసిన జగన్ రెడ్డి తన కేసులకు భయపడి మోడీ ముందు మోకరిల్లారని ఎద్దేవా చేశారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి రావాల్సిన అవసరం లేదని, అక్కడ నుండి బటన్ నొక్కితే సరిపోతుందని తెలిపారు. షిప్పింగ్ హార్బర్‌ను అదానికి తాకట్టు పెట్టేందుకు రూ.400 కోట్లతో అభివద్ధి చేస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు ప్రధానమంత్రి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. రూ.100 కోట్ల ఖర్చు తప్ప రాష్ట్రానికి ప్రధాని నుంచి ఒక హామీని కూడా రాబట్టలేకపోయారని, ఇది ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు కోట్ని రామకృష్ణ, దూలం ప్రసాద్, మళ్ల గణేష్, ఇల్లూరి సత్యనారాయణ పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్‌పై ప్రధాని ప్రకటన లేకపోవడం దారుణం : మాజీ ఎమ్ల్మెల్యే
ప్రజాశక్తి-కశింకోట : విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌పై ప్రధాని నరేంద్రమోడీ విశాఖ పర్యటనలో ప్రస్తావించకపోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. మండలంలోని కన్నూరుపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కన్నా తనపై ఉన్న సీబీఐ కేసుల మాఫీపైనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి శ్రద్ధ చూపించారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమి లేదన్నారు. బాబాయి హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కాం నుండి బయటపడేందుకే మోడీ భజన చేశారన్నారు. కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన వ్యక్తి ఇప్పుడు దాని ముందు మొకరిల్లారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలో వైసిపి పాత్ర ఉందని మరోసారి రుజువైందన్నారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షుడు కాయల మురళి, నాయకులు కుండ్రపు అక్కు నాయుడు, కన్నూరు ఎర్రి నాయుడు, చెరకం ఈశ్వరరావు, తలారి లక్ష్మీ ప్రసాద్, కరణం కోటి, మనశాల నానాజీ తదితరులు పాల్గొన్నారు.










