Jul 19,2022 00:49

ఫ్లకార్డులు చేబూని నిరసన తెలుపుతున్న సిపిఎం, సిపిఐ నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి చెందిన రాష్ట్రపతి అభ్యర్థికి భేషరతుగా వైసిపి, టిడిపిలు మద్దతు ప్రకటించడాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం తీవ్రంగా ఖండించారు. సోమవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ఆయా పార్టీల వైఖరికి నిరసనగా వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో టిడిపి, వైసిపిలు పోటీపడి రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి మద్దతు ఇవ్వడమంటే రాష్ట్రాన్ని తాకట్టుపెట్టడమేనన్నారు. నేడు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ దానిని పూర్తిచేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయలేదన్నారు. విశాఖకు ఉన్న వాల్తేరు డివిజన్‌ను ఎత్తివేశారన్నారు. రైల్వే జోన్‌. మెట్రో రైల్‌, విద్యాసంస్థలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసగిస్తున్న బిజెపికి వైసిపి, టిడిపిలు భేషరతుగా మద్దతునివ్వటాన్ని ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. మరోవైపున రాష్ట్రానికి రావాల్సిన జిఎస్‌టి వాటాను సైతం రాకుండా బిజెపి చేస్తుందన్నారు. ఎన్నికల ముందు వైసిపికి 25 ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించుకు తీసుకువస్తానని, మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్‌ నేడు ఆ మాట తప్పారా లేదా మడం తిప్పారా ? అన్న విషయాన్ని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.