Apr 24,2023 20:06

ప్రచార భేరిలో మాట్లాడుతున్న గౌస్‌దేశాయి

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌
రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపిని తరిమికొట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయి కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ జొహరాపురంలో సోమవారం ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం నాయకులు విజరు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయి, సిపిఎం నగర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, సిపిఐ నగర నాయకులు మహేష్‌ మాట్లాడారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని, అందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ దేశాన్ని ఎప్పుడూ లేనివిధంగా అప్పుల ఊబిలో ముంచిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని విమర్శించారు. ఇన్ని అప్పులు చేసినప్పటికీ ఈ దేశంలో ఉండే ఏ ఒక్కరి జీవితాలు బాగుపడిన చరిత్ర లేదని, అప్పులు చేసి తెచ్చిన డబ్బులు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని రైల్వే వ్యాగన్‌ వర్క్‌ షాపునకు ఒక్క పైసా నిధులు కేటాయించిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఒక్క పైసా నిధులు కేటాయించలేదని, విశాఖను రైల్వే జోన్‌ చేయలేదని విమర్శించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉండే మేధావి వర్గాన్ని, రచయితలను, విప్లవ కారులను జైలులో పెట్టి ఆయన మూర్ఖత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. మోడీ హయాంలో బాగుపడింది ఎవరయ్యా అంటే అదాని, అంబనిలు తప్ప, ప్రజలు ఎవరూ బాగుపడిన చరిత్ర లేదని చెప్పారు. దేశంలో అనేక శాఖలుగా విస్తరించిన ఆంధ్ర బ్యాంకును విలీనం పేరుతో యూనియన్‌ బ్యాంకులో కలపడం రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు. దేశాన్ని లూటీ చేసి స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని బయటకు తీసి ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ మాటలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. సిపిఎం నాయకులు అబ్దుల్‌ దేశాయి, సిపిఎం నగర కమిటీ సభ్యులు రంగస్వామి, సిపిఐ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కర్నూలు (హాస్పిటల్‌) : ఓర్వకల్లు గ్రామంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి బి.నాగన్న అధ్యక్షతన వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు జి.రామకృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి పి.సుధాకర్‌ మాట్లాడారు. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీని గద్దె దింపాలని తెలిపారు. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత చార్జీలు విపరీతంగా పెంచుతున్నారని విమర్శించారు. చరిత్రను వక్రీకరిస్తూ పాఠ్యపుస్తకాల్లో గాంధీ, భగత్‌ సింగ్‌ లాంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను తీసివేసి బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యాలను దేశ ప్రజలపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు రాజు, సిద్ధయ్య, మల్లికార్జున, చిన్న, అజేంద్ర, వెంకటేశ్వర్లు, రమేష్‌, శేషాద్రి, చిన్న నవీన్‌ పాల్గొన్నారు. అలాగే నగరంలోని కృష్ణానగర్‌, అబ్బాస్‌ నగర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ, శ్రీరామ కాలనీ, గుత్తి పెట్రోల్‌ బంక్‌, శరీన్‌ నగర్‌ ఏరియా, బాలాజీ నగర్‌, శారద నగర్‌, రామకృష్ణ కాలనీ, రామచంద్ర నగర్‌లో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి.రాముడు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.సాయిబాబా, కె.సుధాకరప్ప, సిపిఐ నగర నాయకులు వి.శ్రీనివాసరావు మాట్లాడారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి మరో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మించి, కల్లూరు కాలనీల ప్రజలకు రోజూ తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా 25న సాయంత్రం 6 గంటలకు కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం నాయకులు జి.ఏసు, లక్ష్మయ్య, అక్బర్‌ బాషా, శ్రీనివాసులు, రవి, దేవేంద్ర, వెంకటస్వామి, మహేంద్ర, లాజరు, రామకృష్ణ, రాజు, లక్ష్మన్న పాల్గొన్నారు.