కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోమారు రాష్ట్రాల అధికారాల మీద దాడికి పూనుకుంది. అడ్మినిస్ట్రేషన్‌లో అత్యంత కీలకమైన ఐఎఎస్ అధికారులను తన చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకొని రాష్ట్రాలపైనా, రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల్లోనూ ప్రత్యక్ష జోక్యానికి పావులు కదుపుతుండటం ఆందోళన కలిగించే అంశం. యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యుపిఎస్‌సి) ద్వారా నియమితులయ్యే ఐఎఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగులను రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత బదిలీ వంటి వ్యవహారాల విషయంలో రాష్ట్రాల సమ్మతి ఇప్పటి వరకూ తప్పనిసరి. రాష్ట్రాల అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి పిలిపించుకోవడం కుదురదు. ఈ నిబంధనను ఎత్తివేసి తనకు ఇష్టమొచ్చిన అధికారిని తన ఇష్టానుసారం బదిలీ చేసుకోవడం, వెనక్కి పిలిపించుకోవడం వంటి సవరణలు తీసుకొచ్చేందుకే ఇప్పుడు మోడీ సర్కార్ సమాయమత్తమవుతోంది. ఇందుకోసం ఐఎఎస్ కేడర్ నిబంధనలు (1954)లో ఆరవ పాయింటు (కేడర్ అధికారుల డిప్యుటేషన్)ను సవరించడానికి సిద్ధమైంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలోనే ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించి మోడీ సర్కార్ తన నియంతృత్వ వైఖరి ప్రదర్శిస్తోంది. కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఆలిండియా సర్వీస్ (ఎఐఎస్) అధికారుల కొరత ఉందన్న సాకుతో రాష్ట్రాల హక్కులకు సమాధి కడుతోంది.
కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణా విభాగం ఈ నెల 12న ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ కూడా పంపింది. అందులో నాలుగు ప్రమాదకర ప్రతిపాదనలు పేర్కొంది. దీంతో విస్తుపోయిన పలు రాష్ట్రాలు తమ వ్యతిరేకతను తెలియజేశాయి. ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాలు తమ అభ్యంతరాలు తెలియజేస్తూ డిఓపిటికి లేఖలు రాశాయి. వీటిలో బిజెపి, దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు కూడా ఉండడం గమనార్హం. రాష్ట్రాలు మౌనంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం మరో మారు రిమైండర్లు పంపి, ఆ తర్వాత కూడా స్పందించకపోతే గెజిట్ విడుదల చేసేసి అధికారాలను చేజిక్కించుకుంటుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు అత్యంత తీవ్రంగా స్పందించాయి. సమాఖ్య స్ఫూర్తికి సమాధి కట్టి రాష్ట్రాల హక్కులను కాలరాసే హక్కు మీకెక్కడిదంటూ నిగ్గదీసి ప్రశ్నించిన రాష్ట్రాల తీరు అభినందనీయం.
భారతదేశాన్ని మన రాజ్యాంగం యూనియన్ ఆఫ్ స్టేట్స్ (రాష్ట్రాల సమాఖ్య)గా నిర్వచించింది. సర్వసత్తాక, లౌకిక, ప్రజాతంత్ర, గణతంత్ర దేశంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలతో పార్లమెంటరీ వ్యవస్థ కలిగియున్న దేశం మనది. అంతేకాని కేంద్ర ప్రభుత్వం కింద రాష్ట్రాలు బానిసలుగా ఉండే వ్యవస్థ కాదు. రాష్ట్రాలకు తమవైన ప్రత్యేక హక్కులను రాజ్యాంగం ప్రసాదించింది. శాంతిభద్రతలు, పరిపాలన వంటి కీలకమైన అంశాలు రాష్ట్రాల పరిధి లోనే ఉంటాయి. వ్యవహారికంలో కేంద్ర ప్రభుత్వంగా పిలిచినా వాస్తవానికి అది పార్లమెంటరీ వ్యవస్థలో ఒక భాగం మాత్రమే. సమాఖ్య వ్యవస్థ మన దేశానికి ఆయువుపట్టు. రాష్ట్రాలకు ఉన్న ఈ హక్కులను తమ చేతుల్లోకి తీసుకొని పెత్తనం చలాయించే నియంతృత్వ చర్యలకు మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ యథేచ్ఛగా పాల్పడుతూనే వుంది. నూతన విద్యా విధానం, విద్యుత్ సంస్కరణలు, మేజర్ పోర్టుల చట్టానికి సవరణలు ఇలా ప్రతి అంశంలోనూ తన జోక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. ముందుకు సాగిపోతున్న నియంతృత్వ బిజెపికి ముకుతాడు వేయాలంటే రాష్ట్రాల ప్రభుత్వాలు ధీటుగా స్పందించాల్సి వుంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు కలిగించే దుర్మార్గపు ఎత్తుగడ. గణతంత్ర దినోత్సవాన శకటాలు ప్రదర్శించే విషయంలో కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల్లో వేటికీ అనుమతి ఇవ్వకుండా వివక్ష చూపిన కేంద్రంపై తమిళనాడు, కేరళ దీటుగా స్పందించాయి. ఆ విషయంలోనూ తెలుగు రాష్ట్రాలు మౌనం దాల్చాయి. కేంద్ర నియంతృత్వంపై మౌనం వహిస్తే అది ప్రజాస్వామ్య పునాదికే ప్రమాదకరం. ఇప్పటికైనా మోడీ సర్కార్ దుర్మార్గపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపాలి. ప్రత్యేకించి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయాన్ని చేస్తూ వివక్షత చూపుతున్న బిజెపి ప్రభుత్వ తీరుపై పోరులో ఇతర రాష్ట్రాలు సైతం కలిసివచ్చే అవకాశం ఉన్న ఈ విషయంలో చొరవ ప్రదర్శించకపోవడం ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది.










