కౌలు రైతులకు అన్యాయం
రాష్ట్రంలో దాదాపు 32 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. వారిలో సగం మందికి భూమి లేదు. అందులో లక్షన్నర మందికే రైతు భరోసా అందింది. పండించే కౌలు రైతుకు భరోసా ఇవ్వకుంటే వ్యవసాయం ఎలా అభివృద్ధి అవుతుంది? ఈ సంవత్సరం కూడా కౌలు రైతులకు ఆలస్యంగానే సహాయం అందిస్తారట. అందులోనూ బడ్జెట్లో భరోసా నిధులు పెరగనప్పుడు కౌలు రైతులకు మరోసారి మొండి చేయి ఎదురవుతుంది. వ్యవసాయ బడ్జెట్‌లో కౌలు సేద్యానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప కౌలురైతులకు న్యాయం జరగదు. అందుకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలి.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల అమలు
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా ఉంది. రైతు ఉద్యమానికి ఒక వైపు మద్దతు తెలుపుతూ మరో వైపు వాటినే అమలు చేయడాన్ని ఏమనాలి? కేంద్రం రూపొందించిన విద్యా విధానానికి ఈ బడ్జెట్ మద్దతు ప్రకటించింది. విద్యుత్ చట్ట సవరణపై ఉలుకు లేదు. పైగా ఆ చట్టానికి అనుగుణంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారు. హర్షించాల్సిన విషయం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయడం.
కేంద్రంపై భ్రమలా? భయమా?
ఈ బడ్జెట్‌ను పూర్తిగా అప్పుల పైనా, కేంద్రం ఇచ్చే నిధుల పైనా ఆధారపడి రూపొందించారు. దివాళా తీసినవారే ఆస్తులు అమ్ముకుంటారు. మన ప్రభుత్వం కూడా ఆస్తులు అమ్మడానికి పథకం రూపొందించింది. కాని ఎవరి స్వంత ఆస్తులు కావు. ప్రజల ఆస్తి. దాన్ని అమ్మే హక్కు ప్రభుత్వాలకు లేదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అలా అమ్ముతుంటే వైయస్‌ఆర్ కాంగ్రెసు వ్యతిరేకించింది. అప్పులు గతం కన్నా పెరిగాయి. అప్పులైతే ప్రభుత్వం తెస్తుంది. కాని వాటిని తీర్చడానికి, వడ్డీల చెల్లింపులకు ప్రజలే బాధ్యత వహించాలి. ద్రవ్యలోటు జిడిపి లో మూడు నుండి 5 పాయింటు 5 శాతానికి పెరిగింది. కేంద్రం విధించిన పరిధిని కూడా ఇది దాటింది. అప్పులు తెచ్చుకోడానికి కేంద్రం షరతులు పెట్టి అనుమతించింది. పట్టణాల్లో చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంచాలని, వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని, పెద్ద పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని షరతు విధించింది. దాన్నే జగన్‌మోహన్ రెడ్డిగారు తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. కేంద్రం తెచ్చిన ప్రజా వ్యతిరేక బిల్లులకు మద్దతునీయడమే కాదు బిజెపి చేసే తప్పులను కూడా బహిరంగంగా సమర్ధిస్తున్నారు.
మీరు పూలు చల్లుతున్నంతకాలం వారు రాళ్లు వేస్తూనే ఉంటారు
దొంగే 'దొంగ..దొంగ...' అని అరచినట్లుగా ఉంది బిజెపి గోల. ఈ బడ్జెట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర బిజెపి విభాగం నిరసనలకు పిలుపునిచ్చింది. దానిపై వైయస్‌ఆర్ కాంగ్రెసు ప్రతినిధి స్పందిస్తూ మేము మీపై పూలు చల్లుతుంటే మీరు మాపై రాళ్లు వేస్తారా అని వాపోయారు. ఈ మాట కేంద్ర ప్రభుత్వం, బిజెపి ల పట్ల వైయస్‌ఆర్ కాంగ్రెసు వైఖరికి అద్దం పడుతున్నది. రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేసిన బిజెపి ఎడల రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహంతో ఉంటే వీరు పూలు చల్లుతున్నారు. ప్రజాభిప్రాయానికి ఇచ్చే విలువ ఇంతేనా? అంతే కాదు. మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట మాత్రం ప్రస్తావించలేదు. ఈ డిమాండ్లు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నం. వారికి ప్రతినిధిగా ఉండే రాష్ట్ర ప్రభుత్వ స్పందన అలా ఉంటే ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది.
మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం వాటా 4.31 శాతం నుండి 4.04 శాతానికి తగ్గింది. 2020తో పోలిస్తే 2021లో రూ. 9 వేల కోట్లు కోల్పోయాము. కేంద్ర బడ్జెట్ లోనూ మన రాష్ట్రానికి ఒక్క పథకమూ రాలేదు. హక్కుగా మనకు రావాల్సిన నిధుల కోసం కొట్లాడకుండా దేబిరిస్తుంటే బిజెపి వాళ్లు పరిహాసమాడుతున్నారు. ఇది రాష్ట్రానికి అవమానం కాదా? రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సహాయం రావడం లేదని ముఖ్యమంత్రి ఉత్తరాలనేకం రాశారు. అంతవరకు మంచిదే. కాని వాటి సాధనకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బిజెపి దాన్ని కూడా సహించలేకపోతోంది. రాష్ట్రానికి ఇవ్వాల్సిన సహాయం ఇవ్వకుండా ముద్దాయిగా రాష్ట్ర ప్రజల బోనులో నిలబడ్డ బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తోంది. కేంద్రం సహాయం చేస్తున్నా తెచ్చుకోవడం మీకు చేతకావడం లేదని ఆరోపిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి కానీ, వారి ప్రతినిధులు కానీ స్పందించలేదు. కారణం ఏమిటో వారే చెప్పాలి. మోడీ అంటే భయమా? భక్తా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ ఏడేళ్లలో ఏనాడూ మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా ఇవ్వలేదు. నిర్లక్ష్యం చేస్తూనే వస్తోంది. అయినా జగన్ గారికి కేంద్రంపై ఎక్కడ లేని భ్రమ ఎందుకు? ఎప్పుడూ మొండి చేయి చూపిస్తున్నా 'అదిగో ఇదిగో' వస్తుందంటూ ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు. రాని సహాయాన్ని చూపెట్టి బడ్జెట్లో నిధులు కేటాయించడం ఏమిటి? మబ్బుల్ని చూసి ఎవరో వెనకటికి ఒకరు చేతిలోని ముంత పగలగొట్టుకున్నాట్ట. అలా ఉంది రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఆఖరికి ఆ నిధులు రాకపోతే ఖర్చులకు గాను తిరిగి ప్రజలపై భారం మోపాలి లేదా ఖర్చులపై కోత విధించాలి. కోత విధించాల్సి వస్తే మొదటి దెబ్బ సంక్షేమ పథకాల పైనే పడుతుంది. ఏ సంక్షేమ పథకాలైతే జగన్ అంటే ప్రజల్లో సానుకూలత సృష్టించాయో వాటినే ఫణంగా పెడితే వారి రాజకీయ భవిష్యత్తుకు కూడా మంగళం పాడాల్సిందే. అందుకే ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిపై పునరాలోచించాలి. కేంద్రం నుండి రావాల్సిన నిధులను రాబట్టడానికి, ప్రజలపై భారాలు పడకుండా అదనపు రాయితీలు సాధించుకోడానికి కేంద్రంపై పోరాడటం మినహా మరో మార్గం లేదు. భయం, భ్రమలు వీడి ప్రజలను కూడగట్టి కేంద్రంపై ఆత్మాభిమాన పోరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావాలి.
కేరళ ప్రత్యామ్నాయం
కరోనాను ఎదుర్కోవడంలో కేరళ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుంది. కేసులు ఎక్కువగా ఉన్నా ప్రతి ఒక్కరికీ వైద్యం ఉచితంగా అందించి మరణాలు తగ్గించగలిగింది. ముందు చూపుతో ఆక్సిజన్ కొరత లేకుండా చేసింది. ఏడాదిగా ప్రతి ఇంటికీ బియ్యం, పప్పులు, నూనె, చింతపండు, మిర్చితో సహా 16 రకాల వస్తువులతో ఉచిత రేషను కిట్ అందిస్తోంది. పంచాయితీ స్థాయిలో ఐసొలేషన్ సెంటర్లు పెట్టింది. దానికి అనుబంధంగా కమ్యూనిటీ కిచెన్లు నడుపుతోంది. దీన్నే పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోడీ దేశమంతా అమలు చేయాలని కోరారు. ఇదే కాలంలో ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను, సహకార వ్యవస్థను కేరళ ప్రభుత్వం పటిష్టపరిచింది. ఒక చిన్న రాష్ట్రం దీన్నెలా సాధించగలిగింది. కేరళ విజయానికి ఐదు కారణాలున్నాయి. ఒకటి: ప్రజలపై భారాలు వేయకుండా అంతర్గత నిధులు సమకూర్చుకోవడం, రెండు: రాజకీయ అవినీతి లేకుండా ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం, మూడు: ప్రజలను భాగస్వాముల్ని చేయడం, నాలుగు: స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు ఇవ్వడం, ఐదు: రాష్ట్రం హక్కుల కోసం కేంద్రంపై రాజీ లేని పోరాటం చేయడం. ఇప్పుడు దేశానికి కావలసింది గుజరాత్ నమూనా కాదు. అది విఫలమైంది. కేరళ నమూనా కావాలి. ప్రజా సంక్షేమం కోరుకునే ఎవరైనా దీన్నుండి స్ఫూర్తి పొందాలి. మన పాలకులు పాఠం నేర్చుకోవాలి.
వి. శ్రీనివాసరావు- / వ్యాసకర్త సిపిఐ(యం) కేంద్ర కమిటీ సభ్యులు /










