Jul 23,2022 00:14

మాట్లాడుతున్న జెవి.సత్యనారాయణ మూర్తి

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విభజనానంతరం జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి రెండూ రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి తాకట్టు పెట్టాయని, రాష్టపతి ఎన్నికలో ఆ విషయం తేటతెల్లమైందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణ మూర్తి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. విభజన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రమైన అన్యాయం చేసిందని విమర్శించారు. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో అధికార వైసిపి వైఫల్యం చెందిందన్నారు. ఎన్‌డిఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్థికి తాజా ఎన్నికలో అధికార, ప్రతిపక్ష పార్టీల ఓట్లు నూటికి నూరు శాతం పడ్డాయని, దీనిని బట్టే ఈ రాష్ట్ర అభివృద్ధిపై ఆయా పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే అర్థమవుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని, విభజన హామీలు అమలుకు కృషి చేస్తామని ప్రగల్బాలు పలికిన వైసిపి నేడు ఆ వైపుగా చర్యలు చేపట్టడం లేదని, వ్యక్తిగత ప్రయోజనాలకు తలొగ్గి రాష్ట్రాభివృద్ధిని కేంద్రానికి తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 26 నుంచి 28 వరకు విశాఖ వేదికగా జరుగనున్న పార్టీ 27వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అక్టోబరులో విజయవాడలో జరిగే పార్టీ జాతీయ మహాసభలో దేశ, రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అత్తిలి విమల అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎజె.స్టాలిన్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.సత్యాంజ నేయ, కె.సత్యనారాయణ, ఎస్‌కె.రెహమాన్‌, ఆర్‌.శ్రీనివాసరావు, జి.రాంబాబు, సిఎన్‌.క్షేత్రపాల్‌ పాల్గొన్నారు.