Jun 18,2021 06:44

    సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి, 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విధానం ఉంది. 5వ తరగతి వరకూ చదివే పిల్లలకు స్కూలు ఒక కి.మీ. దూరం లోపు ఉండాలని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం 3వ తరగతి నుండే పిల్లలను దూరంగా ఉండే స్కూళ్ళకు పంపాలని ప్రతిపాదిస్తోంది.
   మోడీ ప్రభుత్వం ఈ కరోనా సంక్షోభ కాలంలోనే తన హిందూత్వ ఎజెండాను వేగంగా, ఏక పక్షంగా దేశం మీద రుద్దుతోంది. అందులో భాగంగానే విద్యా విధానంలో తీవ్రమైన మార్పులను సూచిస్తూ ఏప్రిల్‌ లో రాష్ట్రాలకు సర్క్యులర్‌ జారీ చేసింది. ఆ తర్వాత కేంద్ర విద్యామంత్రి నేరుగా రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జాబితాలో వున్న విద్యా రంగం మీద మోడీ పెత్తనం ఏమిటని అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలు ఈ నూతన విద్యావిధానాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేది లేదని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా దీని అమలుకు ఇంకా పూనుకోలేదు. కాని జగన్‌ ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనపడుతోంది. కేంద్ర విధానం ప్రకారం రానున్న విద్యా సంవత్సరం నుండే మార్పులు అమలు చేస్తామంటూ తన సర్క్యులర్‌లో సూచించింది. విద్యా విధానంలో మార్పులు, చేర్పులు చేయాలంటే ఎంతో మేధోమథనం జరగాలి. విద్యా రంగ మేధావులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, స్కూలు కమిటీలతో చర్చించాలి. వారి సలహాలు తీసుకోవాలి. కాని అదేమీ లేకుండానే అమలుకు తొందర పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.
 

                                                           ప్రాథమిక విద్యా వ్యవస్థపై దాడి

    పాఠశాల పూర్వ విద్య (ప్రీ-ప్రైమరీ) ప్రవేశ పెడతామంటూ ఆ పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను దెబ్బ తీయడం ఈ సర్క్యులర్‌ లోని ప్రధాన అంశం. ప్రాథమిక విద్యను రెండుగా విభజిస్తారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్ళకు, యు.పి స్కూళ్లకు తరలిస్తారు. 1, 2 తరగతుల పిల్లలను ఫౌండేషన్‌ స్కూళ్లలో పెడతారు. ఒకటవ తరగతి కన్నా ముందు రెండేళ్ళు పాఠశాల పూర్వ విద్య ఇక్కడ నేర్పుతారు. ప్రస్తుతం ఉన్న 34 వేల ప్రాథమిక పాఠశాలలు ఇకముందు వుండవు.
 

                                         ఊరి బడికి దూరం చేసి పిల్లలను మరో ఊరు నడిపిస్తారా ?

   3, 4, 5 తరగతులు చదివే చిన్న పిల్లలు రోజూ 3 కి.మీ నుండి 6 కి.మీ దూరంలో వుండే హైస్కూలుకు నడిచి వెళ్లి రాలేరు. అక్కడక్కడా 8, 10 కిలో మీటర్ల దూరం ఉంది. గిరిజన గ్రామాలలో హైస్కూళ్ళు ఇంకా ఎక్కువ దూరమే ఉంటాయి. గతంలో 5వ తరగతి వరకు గ్రామాల్లో పెట్టింది విద్యను పిల్లలకు చేరువ చేయడానికే. ఇప్పుడు దానికి పూర్తి వ్యతిరేక దిశలో జగన్‌ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న రాజ్యాంగ లక్ష్యానికి, 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా ఈ విధానం ఉంది. 5 వ తరగతి వరకూ చదివే పిల్లలకు స్కూలు ఒక కి.మీ. దూరం లోపు ఉండాలని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తోంది. కాని రాష్ట్ర ప్రభుత్వం 3వ తరగతి నుండే పిల్లలను దూరంగా ఉండే స్కూళ్ళకు పంపాలని ప్రతిపాదిస్తోంది.
 

                                       కార్పొరేట్‌ స్కూళ్ళకు పంపేస్తారు లేదా బడి మాన్పించేస్తారు

    లేచిన దగ్గర నుండి పని చేస్తే తప్ప గడవని పేద జనం పిల్లలను రోజూ బడిలో దింపి తీసుకురాలేరు. వందల రూపాయలు ఇచ్చి ఆటో పెట్టుకోవాలి. డబ్బులు పెట్టలేని వారు బడి మాన్పించేస్తారు. ఇదే అదనుగా కార్పొరేట్‌ స్కూళ్లు గ్రామాలకు బస్సులు పంపి పిల్లలను తమ స్కూళ్ళకు పట్టుకుపోతాయి. దానివలన ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు తగ్గితే వాటిని మూసేస్తారు. విద్యను ప్రైవేటుపరం చేసే లక్ష్యం దీని వెనుక కనిపిస్తోంది.
 

                                                   గిరిజన ప్రాంత అనుభవం ఏం చెప్తోంది ?

   చంద్రబాబు ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో జివికె పాఠశాలలో చదువుతున్న 3, 4 తరగతులు చదువుతున్న పిల్లలను హాస్టళ్లు ఉన్న స్కూళ్లకు తరలించారు. తల్లిదండ్రులకు దూరమై పిల్లలు బడి మానేశారు. కొన్ని గ్రామాల్లో గిరిజన సంఘం, యుటిఎఫ్‌ కృషి వలన, తల్లిదండ్రుల వ్యతిరేకత వలన పిల్లలను తరలించలేకపోయారు. ఆ గ్రామాల్లో డ్రాపవుట్లు లేవు. ఇంత స్పష్టమైన అనుభవం వున్నా అదే తప్పు రాష్ట్రం అంతా చేయడమెందుకు ?.
 

                                                  తెలుగు మీడియం - టీచర్‌ పోస్టులు రద్దు

    ప్రభుత్వ సర్క్యులర్‌లో రెండు హైస్కూళ్ల మధ్య దూరం 5 కి.మీ లోపు ఉన్నట్లైతే ఏ మీడియంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే అదే మీడియం ఆ స్కూల్లో ఉంటుంది. రెండో మీడియం వారు పక్క స్కూలుకు పోవాలి. లేదా మీడియం మార్చుకోవాలి. ఈ షరతుతో తెలుగు మీడియం లేపేస్తారు. తెలుగులో బోధించే టీచర్లను ప్రస్తుతం సర్దుబాటు చేస్తారు. టీచర్‌ పోస్టులు మాత్రం శాశ్వతంగా రద్దు చేస్తారు.
 

                                                       మన తెలుగుకేమిటి ఈ అరిష్టం ?

   ప్రతి జాతి తన భాషను ఇంగ్లీషు ముప్పు నుండి రక్షించుకొంటున్నది. మన తెలుగుకేమిటి ఈ అరిష్టం? ఒకవైపు హిందీ రుద్దేద్దామని బిజెపి ప్రయత్నిస్తుంటే జగన్‌ మోహన్‌ రెడ్డి ఇంగ్లీషు రుద్దేస్తున్నారు. రవీంద్రనాథ్‌ టాగూర్‌, గురజాడ, గాంధీ, నెహ్రూ అందరూ మాతృభాషలో చదువుకున్నారు. ఇంగ్లీషు నేర్చుకున్నారు. అంతే తప్ప ఇంగ్లీషు మీడియంలో చదువుకోలేదు. జగన్‌కు తెలియదా? లేక కార్పొరేట్‌ ప్రభావమా?
టీచర్‌ పోస్టుల కోసం ఎదురు చూసే యువతకు నిరాశే
     డిఎస్‌సి కొన్నేళ్ళుగా రాజకీయ హామీ అయ్యింది. టీచర్‌ కావాలనే ఆశతో ఉన్న యువతను, వారి తల్లిదండ్రులను ఓట్లు కోసం మోసం చేసే పావు అయ్యింది. చంద్రబాబు ఊరించి ఊరించి చివరలో ఒకసారి డిఎస్‌సి వేశారు. జగన్‌ ప్రభుత్వం టెట్‌ పెట్టేస్తాం, డిఎస్‌సి వేసేస్తామని ప్రకటనల మీద ప్రకటనలే తప్ప చేయడం లేదు. ఫౌండేషన్‌ స్కూళ్ళలో టీచర్లతోనే గాక వాలంటీర్లుతో కూడా చదువు చెప్పించుకోవచ్చు. స్వచ్ఛంద సంస్థలకూ అప్పచెప్పవచ్చు. ఇక టీచరు పోస్టుల భర్తీ అవసరం ఏముంది? అందుకే జగన్‌ డిఎస్‌సి వేయడం లేదు.
 

                                                 బాధ్యత నుండి తప్పుకుంటున్న ప్రభుత్వం

    1, 2 తరగతులను, ఐదేళ్ళ వయస్సున్న పిల్లలను కలిపి 18 వేల ఫౌండేషన్‌ స్కూళ్లు; మూడు, నాలుగేేళ్ళ పిల్లలను ప్రీప్రైమరీ - 1, 2గా విభజించి, 5 ఏళ్ళ పిల్లలనూ జోడించి 16 వేల పాఠశాలలు మరో కేటగిరీ; ఇందులో 16 వేల అంగన్‌వాడీ కేంద్రాలు కలిపేస్తారు. ఇవి గాక 3, 4 ఏళ్ళ పిల్లలను 31 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ - 1, 2 గా నడుపుతారు. ఈ మూడింటినీ ఏదో సొసైటీకి అప్పచెప్తారు. 34 వేల మంది టీచర్లను, 16 వేల మంది అంగన్‌వాడీ కార్యకర్తలను సొసైటీలకు పంపేస్తారు. ఇప్పుడున్న 11 వేల హైస్కూళ్ళు మాత్రమే ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతాయి. దాదాపు 70 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దవుతాయి.
 

                                            పార్టీల సమస్య కాదు-ప్రజల సమస్య-కలిసి పోరాడాలి

    మోడీ విద్యా విధానం వలన విద్యా బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవడం...3, 4, 5 తరగతుల పిల్లలను కిలోమీటర్ల దూరం నడిపించడం, తల్లిదండ్రులను వేధించడం, యువతకు టీచర్‌ అవకాశం లేకుండా చేయడం తప్ప ప్రయోజనం ఏముందో చెప్పండి? మోడీ మెప్పు కోసం రాష్ట్రం హక్కును వదిలేసి ప్రజలకు అన్యాయం చేయొద్దని, పిల్లలకు, యువతకు, తెలుగు భాషకు అన్యాయం చేయొద్దని రాష్ట్ర ప్రజలమంతా కలిసి పోరాడదాం. ఇది ప్రజల సమస్య. రాజకీయ అభిమానాలను పక్కన పెట్టి ఒక్కటిగా అందరూ ఉద్యమించాలి.
 

/ వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
ఎం. కృష్ణమూర్తి

ఎం. కృష్ణమూర్తి