కడప అర్బన్ కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో పనిచేస్తున్న జంతుశాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ పి.శచిదేవికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సలీంబాష, అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. గురువారం కళాశాలలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శచీదేవి జంతుశాస్త్ర బోధనతో పాటు కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీపర్‌గా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కళాశాలలో ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. సన్మాన గ్రహీత శచీదేవి మాట్లాడుతూ అవార్డు రావడానికి కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు తోటి అధ్యాపకులు, విద్యార్థులు సహాయ సహకారాలు ఎంతగాను ఉపయోగపడ్డాయని తెలిపారు. అవార్డు కళాశాలకు అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










