Nov 07,2023 20:18

బొబ్బిలి: క్రీడాకారులను అభినందిస్తున్న బేబినాయన

జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరగనున్న వాలీబాల్‌, తైక్వాండో, బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఆయా పాఠశాలల ఉపాద్యాయులు, పీడీలు, ప్రజా ప్రతినిధులు మంగళవారం అభినందించారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించి జిల్లాకు గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షించారు.
ప్రజాశక్తి- కొత్తవలస: 
మండలంలోని దెందేరు ఉన్నత పాఠశాలలో చదువుతున్న విరోతు నవీన్‌, రాంచరణ్‌, గవర జయశ్రీ, యోగితాలు రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 9 నుండి 11వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరుకులో జరగనున్న రాష్ట్ర స్థాయి వాలీబాల్‌ అండర్‌ 14 విభాగంలో పాల్గొంటారు. వీరిని హెచ్‌ఎం సునీత, పీడీ కె. కృష్ణరాజు, దెందేరు సర్పంచ్‌ వి.రమణ, గులివిందడ సర్పంచ్‌ గణేష్‌, పాఠశాల సిబ్బంది మంగళవారం అభినందించారు.
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు క్రీడాకారులు
బొబ్బిలి: రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 9,10,11న కడప జిల్లా కోడూరులో జరగనున్న అండర్‌ 17, అండర్‌ 19 విభాగాల్లో తైక్వాండో పోటీలకు కె.అభినవ్‌, సోమేష్‌ యాదవ్‌, బి. రోహిత్‌, కిషోర్‌ కుమార్‌ ఎంపికైనట్లు కోచ్‌ బంకురు ప్రసాద్‌ చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన అభినందించారు. పోటీలలో ప్రతిభ కనబరిచి బొబ్బిలికి మంచి పేరు తీసుకురావాలని బేబినాయన కోరారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపిక
శృంగవరపుకోట: మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు బాలురు, బాలికలు ఎస్‌జిఎఫ్‌ రాష్ట్రస్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పొట్నూరు శ్రీరాములు మంగళవారం తెలిపారు. ఈ విద్యార్థులు మండలంలోని వెంకటరమణపేటలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీల నుండి ఎంపిక అయ్యారన్నారు. అండర్‌ 14కు వెలగల సాగర్‌, రాడి గాయత్రి, అండర్‌ 17కు బురాడ యోగి, వీరవరపు కావ్యలు ఎంపికయ్యారని చెప్పారు. త్వరలో జరగబోవు రాష్ట్రస్థాయి ఎస్‌జిఎఫ్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలలో వీరు విజయనగరం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంగారు ఉమామహేశ్వరరావు, ఉప ప్రదానోపాద్యాయులు సగుబండి శివరామకృష్ణ, రహీం షేక్‌ లాల్‌, పొట్నూరు శివాజీ, సతీష్‌, రాజేష్‌, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.
ఎంవిజిఆర్‌లో బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌
డెంకాడ : ఎంవిజిఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మొదటి ఇంటర్‌ కాలేజియేట్‌ బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ కమ్‌ సౌత్‌ జోన్‌ ఇంటర్‌-యూనివర్శిటీ సెలక్షన్‌లను మంగళవారం నిర్వహించారు. టోర్నమెంట్‌లో 10 కళాశాలలు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్‌లో ఎంవిజిఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ విజేతగా, శ్రీకాకుళం టెక్కలి ఐతమ్‌ కళాశాల రన్నర్స్‌గా నిలిచాయి. ఈ కార్యక్రమానికి జెఎన్‌టియు పరిశీలకులు పిఎస్‌వి రమణ, ఎంపిక కమిటీ సభ్యులు బి. రామయ్య, సిహెచ్‌ రవి తదితరులు పాల్గొన్నారు.