Mar 04,2021 07:13

ప్రస్తుతం అమలులో ఉన్న స్టేట్‌ సిలబస్‌ స్థానంలో 1 నుండి 10 వ తరగతి వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) సిలబస్‌ను దశలవారీగా ప్రవేశ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1 నుండి 7 తరగతులకు 2021-22 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించారు. 8,9,10 తరగతులకు క్రమంగా అమలు చేస్తూ 2024 నాటికి 1-10 తరగతులను సిబిఎస్‌ఇ పరిధి లోకి వస్తాయని ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అంటే 2024 తరువాత మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రభుత్వ బడులలో, మన రాష్ట్ర సిలబస్‌ ఉండదన్న మాట. విద్యా రంగాన్ని విద్యార్థుల, రాష్ట్ర భవిష్యత్తును తీవ్రమైన ప్రభావానికి లోనుచేసే కీలకమైన నిర్ణయం ఇది. రాష్ట్రంలో విద్యావేత్తలతో కానీ, వాటాదారులతో కానీ చర్చించకుండా ఈ నిర్ణయం చేశారు. విద్య ఉమ్మడి జాబితా లోని అంశం. సిలబస్‌ను రూపొందించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలది. ఉమ్మడి జాబితాలో విద్యను పొరదుపర్చటంలో ఉద్దేశం రాష్ట్రాలు తమ ప్రాంతాల స్థానికత, ప్రత్యేకత, చారిత్రకత, భిన్నత్వాలు సంస్కృతులు... ఆధారంగా సిలబస్‌ను రూపొందించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం సిలబస్‌ను రూపొందించుకునే రాష్ట్రం యొక్క హక్కును వదులుకుని కేంద్రం చేతులలో పెట్టడమే. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న కారణం సిబిఎస్‌ఇ సిలబస్‌ పాఠ్యాంశాలలో నాణ్యత కోసమే అని. నాణ్యత కోసమే ఈ నిర్ణయం అయితే సిబిఎస్‌ఇ తో పాటు ఇతర బోర్డుల లోని మంచి అంశాలను తీసుకొని మన రాష్ట్ర సిలబస్‌లో ప్రవేశ పెట్టవచ్చు .ఇందుకోసం మన రాష్ట్ర హక్కును వదులుకోవలసిన అవసరం లేదు. నిజానికి హయ్యర్‌ సెకండరీ స్థాయిలో గణితం మరియు సైన్స్‌ సబ్జెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌ పాఠ్యపుస్తకాలు అత్యుత్తమమైనవని, అందువలనే అన్ని రకాల జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో ముందు ఉంటున్నదని ఒక వాదన.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాఠ్యపుస్తకాలు కూడా ఆ తరహాలో రూపొందించినవే. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా పాఠ్యాంశాల కుదింపు, ఆనంద వేదిక లాంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నది. పాఠ్యపుస్తకాలను తెలుగు, ఆంగ్ల భాషలలో ఆకర్షణీయంగా ముద్రించి పంపిణీ చేస్తున్నది. అఖిల భారత స్థాయి ప్రవేశ పరీక్షలు సిబిఎస్‌ఇ సిలబస్‌ ఆధారంగా జరుగుతాయన్న ఒక వాదన ఉంది. అయితే ఇది నిజమనుకున్నా అతికొద్దిమందికి ప్రవేశం లభించే ఈ పరీక్షల కోసం మొత్తం విద్యార్థులను సిబిఎస్‌ఇ సిలబస్‌ చదవమనటం అన్యాయం. రాష్ట్ర సిలబస్‌ లేకుండా చేయడం అసమంజసం. సిబిఎస్‌ఇ సిలబస్‌ నాణ్యమైనదా కాదా అన్నదే చర్చ. కేంద్రం రూపొందించిన 'నూతన జాతీయ విద్యా విధానం 2020' (ఎన్‌ఇపి) అమలకు రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నది. ఈ ఒత్తిడి రాజ్యాంగ విరుద్ధం. దానిని ప్రతిఘటించాల్సిందిపోయి రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవడం శోచనీయం.
మోడీ ప్రభుత్వపు జాతీయ విద్యా విధానంలో పాఠ్య పుస్తకాలన్నీ జాతీయ స్థాయిలోనే రూపొందించాలని రాష్ట్రాలు అవసరం అనుకుంటే కొంత జోడించుకోవచ్చని చెప్పింది. అంటే దీనర్ధం సిలబస్‌ను రూపొందించుకునే హక్కు రాష్ట్రం నుండి కేంద్రం తీసుకోవడమే కదా. పాఠ్యపుస్తకాలు జాతీయ స్థాయిలోనే ప్రధానంగా రూపొందించాలని, కావాలనుకుంటే రాష్ట్రాలు అదనంగా జోడించవచ్చునని ఎన్‌ఇపి చెప్తోంది. పైగా అందుకయ్యే ఖర్చును ప్రైవేటు దాతృత్వ సంస్థల నుంచి తెచ్చుకోవాలని చెప్తోంది. ఇది పరోక్షంగా పాఠ్యపుస్తకాల తయారీని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచురణ సంస్థల చేతుల్లో పెట్టడమే. ఎన్‌ఇపి 100 విదేశీ యూనివర్సిటీలను మన దేశంలోకి ఆహ్వానిస్తున్నది. విదేశీ యూనివర్సిటీలు మన దేశంలో విజయవంతంగా నడవాలంటే, వాటి మార్కెట్‌ విస్తరించాలంటే వాటికి ప్రాథమికంగా రెండు ఆటంకాలున్నాయి. మొదటిది ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న ప్రభుత్వరంగం లోని స్వదేశీ యూనివర్సిటీల నుండి ఏర్పడే పోటీ. ఈ పోటీ లేకుండా చేయడానికి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మంచి పేరు ప్రతిష్టలున్న ప్రభుత్వ రంగంలోని స్వదేశీ యూనివర్సిటీలను దెబ్బతీస్తున్నది. జెఎన్‌యు, హెచ్‌సియు, జాదవపూర్‌ యూనివర్సిటీ, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, మద్రాస్‌ ఐఐటి తదితర విద్యాసంస్థలన్నింటిలోనూ ఏదో ఒక కారణంతో ఇబ్బందులు సృష్టించి వాటిని అప్రతిష్ట పాలు చేస్తూ వస్తున్న్దది. అనేక వంకర నిబంధనలు పెడుతూ యూనివర్సిటీలకు సకాలంలో సక్రమంగా నిధులు విడుదల చేయకుండా బలహీన పరుస్తున్నది. అయినా తట్టుకొని నిలబడి ఈ స్వదేశీ యూనివర్సిటీలు నడుస్తున్నాయి. రెండవది దేశ వ్యాప్తంగా వేర్వేరు సిలబస్‌లు, వేర్వేరు పరీక్షలు, వేర్వేరు భాషలలో బోధించడం జరుగుతోంది. విదేశీ యూనివర్సిటీలు మన దేశంలో విద్యార్ధుల ప్రవేశాలు బోధన, పరీక్షలు ఇతర అకడమిక్‌ మరియు అడ్మినిస్ట్రేషన్‌, పరిపాలనా పరమైన అంశాలన్నీ దాదాపుగా ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్వహిస్తాయి. వాటి క్యాంపస్‌లు పెట్టినప్పటికీ భౌతికమైన కార్యకలాపాలు తక్కువ. వాటి మార్కెట్‌ విస్తరించాలంటే దేశ వ్యాప్తంగా ఒకే సిలబస్‌ ఉండటం అవసరం. బోధనాభ్యసనానికి ఆన్‌లైన్‌ వనరులు మరియు డిజిటల్‌ ప్లాట్‌ ఫారమ్‌లను పెద్దఎత్తున వినియోగించాలని ఎన్‌ఇపి చెప్పింది. ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని అందించే వ్యాపార సంస్థల వ్యాపారం బాగా జరగాలన్నా ఒకే రకమైన సిలబస్‌ అవసరం. 2018 నాటికి ఆన్‌లైన్‌ విద్యా వ్యాపారం మన దేశంలో 39 బిలియన్లలో ఉన్న దాన్ని 2024 నాటికి 360 బిలియన్లకు చేరవచ్చునని అంచనా.
ఉపాధ్యాయ నియామకాలలో సి.టెట్‌, టెట్‌ మరియు విషయ నైపుణ్యాలపై ఎన్‌.టి.ఎ ద్వారా పరీక్షలు నిర్వహించాలని ఎన్‌ఇపి చెప్పింది. ఈ పరీక్షల మార్కెట్‌ విస్తరించాలన్నా కూడా దేశవ్యాప్తంగా ఒకే సిలబస్‌ ఉండటం అవసరం. అంటే విదేశీ విద్యా సంస్థల ఆన్‌లైన్‌ వ్యాపారం తేలికగా జరగడానికి 'ఒకే విద్యా విధానం-ఒకే సిలబస్‌' నినాదం వచ్చిందని తేటతెల్లం అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల విద్యా వ్యాపార లాభాల కోసం రాష్ట్రాల ప్రత్యేకతలపై, హక్కులపై దాడి చేస్తున్నారు. పైగా, తన హిందూత్వ ఎజెండాను మరింత వేగంగా అమలు చేయడం బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. అందుకే స్కూలు విద్యా స్థాయి నుంచే కాషాయీకరణ చేయడానికి ప్రయత్నిస్తోంది. తద్వారా పచ్చి అభివృద్ధి నిరోధక, అశాస్త్రీయమైన భావాజాలాన్ని జాతీయ విద్యా విధానం ద్వారా సిలబస్‌ లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తున్నది. ఇందుకు గానూ సిలబస్‌ రూపొందించే ప్రక్రియను పూర్తిగా కేంద్రీకరించి తన చేతుల్లోకి తీసుకుంటున్నది. చిన్నప్పటి నుంచీ శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం ప్రోత్సహించినప్పుడే విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుంది. ప్రజాస్వామిక దృక్పథమూ అలవడుతుంది. అందుకు భిన్నంగా అశాస్త్రీయ భావాలు, ఛాందసత్వం, మనువాద దృక్పథం ఎక్కిస్తే, వక్రీకరించిన చరిత్రను నేర్పితే దేశ మానవ వనరుల అభివృద్ధి దెబ్బ తిని ఇంకా వెనకబడిపోతారు.
విద్యకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు రానురానూ తగ్గుతున్నాయి. రాష్ట్రాల వ్యయం పెరుగుతున్నది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత నిధులు కేటాయింపు ఎప్పుడూ లేనంత తక్కువ స్థాయికి చేరింది. మోడీ అధికారంలోకి వచ్చిన 2014-15 నాటికి జిడిపి లో 0.53 శాతం బడ్జెట్‌లో 4.13 శాతం కేటాయించగా 2019-20 నాటికి జిడిపి లో 0.45 శాతం బడ్జెట్‌లో 0.43 శాతం పడిపోయింది. ప్రస్తుతం విద్యపై దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యయం 10 శాతంలో రాష్ట్రాల వాటానే 80 శాతం ఉంటుంది. కేంద్రం వాటా కేవలం ఐదవ వంతు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వాల విద్యా విషయాల్లో గట్టిగా చొరబడుతోంది. రాష్ట్రాలు విద్యారంగంలో తీసుకురావలసిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నీతిఆయోగ్‌ బ్లూ ప్రింట్‌ తయారుచేస్తున్నది. పెర్ఫార్మెన్స్‌ గ్రౌండ్‌ ఇండెక్స్‌ను రూపొందించి దాని ఆధారంగానే రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తామని బెదిరిస్తున్నది. వ్యయం రాష్ట్రాలది పెత్తనం కేంద్రానిదిగా తయారయింది. ఈ మితిమీరిన చొరబాటు కేంద్రీకరణ రాష్ట్రాల చొరవను పూర్తిగా దెబ్బతీస్తున్నది. కేంద్రం చెప్పినట్లు చేయడం వలన రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థలు పూర్తిగా నామమాత్రంగా మారతాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పెత్తనానికి వ్యతిరేకంగా నిలబడాలి. రాష్ట్రాల హక్కులను, సమాఖ్య విధానాన్ని దెబ్బ తీసే ఎన్‌ఇపి ని వ్యతిరేకించవలసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా దేశంలోనే ఎన్‌ఇపి అమలు చేయడంలో మొదటి స్థానంలో ఉండాలని భావిస్తున్నట్లు మన రాష్ట్ర విద్యా శాఖామంత్రి చెబుతున్నారు. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుంది.
                                     స్టేట్‌ సిలబస్     - కె. శేషగిరి / వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి /