Oct 17,2023 17:32

నేడు ఉపాథిహామీ చట్టం పరిరక్షణపై సదస్సు
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
   ఉపాథి హామీ చట్టాన్ని కాపాడటం కోసం, పని దినాలు, వేతనాల పెంపుకై ఏలూరులో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం ఉపాథి కూలీలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉపాథి హామీ సమస్యలు పరిష్కరించడం కోసం ఈనెల 18వ తేదీ జిల్లాలోని ఏలూరు కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మండలంలోని పట్టినపాలెం గ్రామంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు జోడే సూర్యచంద్రరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంఘం జిల్లా అధ్యక్షుడు జీవరత్నం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాథి హామీ చట్టానికి రూ.2 లక్షల కోట్లు కేటాయించాలన్నారు. కుటుంబానికి రెండు వందల రోజులకు పనులు పెంచి, పెరిగిన నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా రూ.600 వేతనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై పట్టినపాలెం గ్రామంలో ఉపాథి కూలీలందరికీ రాష్ట్ర సదస్సు కరపత్రాలు అందజేశామని తెలిపారు. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఎపి వ్యవసాయ కార్మిక సంఘ జాతీయ నాయకులు, కేరళ ఎంపీ కామ్రేడ్‌ శివ దాసన్‌ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఉభయగోదావరి జిల్లా టీచర్స్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, మంతెన సీతారాం ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ ప్రచారంలో మండల కార్యదర్శి ఎ.ప్రభాకర్‌ రావు, కె.సుబ్బారావు, కొర్సా రాముడు, పూసం దర్గా, కరువుల దుర్గారావు, బి.లక్ష్మి, టి.దుర్గా పాల్గొన్నారు.