కరపత్రం ఆవిష్కరణ
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సదస్సు, సమావేశాలు అక్టోబర్ 8, 9, 10 తేదీల్లో ఏలూరులో నిర్వహింస్తున్నామని, ఈ సమావేశాలు జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సోమవారం రాష్ట్ర సదస్సు, సమావేశాల కరపత్రాన్ని స్థానిక అన్నే భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జీవరత్నం, పి.రామకృష్ణ మాట్లాడుతూ పేదలందరికీ భూమి పంచాలని, కోనే రంగారావు కమిటీ సిఫార్సు అమలు చేయాలని, భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల ప్రభుత్వ భూమి పంచాలని కోరుతూ రాష్ట్ర సదస్సు, సమావేశాలు మూడురోజుల పాటు ఏలూరు నగరంలో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో గత 25 ఏళ్ల నుంచి పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర ఉందన్నారు. ఈ కాలంలో దెందులూరు మండలం దోసపాడు, జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, ఉంగుటూరు మండలాల్లో పేదల భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నామన్నారు. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఉభయగోదావరి జిల్లాల టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సిలు షేక్ సాబ్జి, ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, మరో 300 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు వై.నాగేందర్రావు, ఎస్.మహంకాళి రావు, సిహెచ్ మాధవ, కె.సుబ్బారావు, సురేష్ పాల్గొన్నారు.










