విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేయాలంటూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించడం స్వాగతించదగిన విషయం. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క భారీ ప్రభుత్వ రంగ సంస్థ కావడం, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు ఉక్కు ప్లాంటుతో ముడిపడి ఉండటంతో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయితే, ఈ పోరాటాన్ని ఎలా నడిపించాలన్న అంశంపై ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు ఇప్పటికే ఒక స్పష్టత ఉంది. వారి దృష్టిలో ఇది కేవలం ఉద్యోగ-ఉపాధి భద్రత కోసం జరుగుతున్న ఆందోళన కాదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసాగించాలన్నది వారి డిమాండ్! ఇది అన్ని రకాల ఉదారవాద విధానాలను సమూలంగా తిరస్కరించడమే! నూతన ఆర్థిక విధానాలకు కట్టుబడిన పాలకవర్గ పార్టీలు ఈ విషయంలో అంత తేలికగా వెనక్కి తగ్గరని, మధ్యేవాద మార్గాన్ని చూడటమో, సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయడమో ఏదో ఒకటి చేస్తారనీ వారికి తెలుసు! అందుకే, ఐక్య ఉద్యమాన్ని వారు పటిష్టంగా ముందుకు తీసుకుపోతున్నారు. ఒకవైపు ఫ్యాక్టరీలో పని చేస్తూ మరో వైపు పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగిస్తున్నారు. 24 గంటలూ నిర్విరామంగా రగిలే ఫర్నిసే నష్టాల అంతు చూడాలన్న వారి దృఢసంకల్పానికి సాక్షి! అదే సమయంలో త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కును పదిలంగా కాపాడి, భావి తరాలకు అందించడానికి అలుపెరగని పోరాటం! ఈ కారణంగానే ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ఎలుగెత్తిన కార్మికులకు రాష్ట్ర ప్రజానీకం విస్తృతంగా మద్దతు తెలుపుతోంది.
ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలని కార్మికలోకపు డిమాండ్‌కు భిన్నమైన ప్రతిపాదనలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ప్లాంటు స్థలాన్ని అమ్మి అప్పులు తీర్చడం, వాటాలు అమ్మడం, స్టాక్ ఎక్స్చేంజ్‌లో నమోదు చేయడం వంటివి వీటిలో కొన్ని! ఈ ప్రతిపాదనలన్నీ ఏదో రూపంలో ప్రయివేటీకరణను ముందుకు తీసుకువెళ్ళేవే కావడం గమనార్హం. అమ్మడమన్నది ఏ కొంచెంగా, ఎక్కడ ప్రారంభమైనా అంతిమంగా అది ప్రజల సొత్తును వారికి దూరం చేయడానికి, కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికే దారి తీస్తుంది. ఈ కారణంగానే కార్మికులు ఈ ప్రతిపాదనలను ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు.
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే నల్లచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతాంగంపై మోడీ సర్కారు వైఖరి ఎలా ఉందో స్పష్టంగా కనపడుతోంది. కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న బిజెపి నేతలు విశాఖ ఉక్కు విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తారని ఆశించలేం. మన రాష్ట్రంలో పెద్దగా రాజకీయ ప్రయోజనాలు సాధించే లెక్కలు కూడా లేవు కాబట్టి మరింత దూకుడుగానే ముందుకెళ్లే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవాలంటే ఐక్యపోరాటాలే మార్గం. విశాఖ స్టీలు ప్లాంటు పరిరక్షణ కోసం, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం రాష్ట్రంలోని అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి బేషరతుగా మద్దతుగా నిలవాలి. కార్మిక లోకం వినిపిస్తున్న డిమాండ్లనే తమ గొంతుకలుగా మార్చుకోవాలి. ఆ ప్రాతిపదికన ఐక్యంగా కేంద్రం మీద పోరాటాన్ని నడపాలి. ఇది మొత్తం తెలుగు ప్రజల పోరాటంగా నడవాలి.
ప్లాంటుకు వచ్చిన నష్టం కార్మికుల వల్ల వచ్చింది కాదు. ప్రభుత్వ విధానాలే ఆ నష్టాలకు కారణం. పాలకుల ప్రైవేటు పక్షపాతం కొనసాగినంత కాలం ఈ తరహా ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. అందుకే, కార్మికులు కోరుతన్నట్లు ప్రభుత్వరంగంలోనే కొనసాగించడంతో పాటు, ప్రత్యేకంగా ఇనుప ఖనిజ గనిని కేటాయించాలి. ఈ దిశలో తీసుకునే చర్యలే ఆంధ్రుల హక్కును భావితరాలకు అందిస్తాయి. అందుకే, ఏ మాత్రం శషభిషలు లేకుండా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం చేయాలి. ఆ తీర్మానం కార్యరూపం ధరించే వరకూ ఉద్యమించాలి.










