Sep 14,2023 23:15

తిరుపతి ఎమ్మెల్యేకి జేఏసీ వినతి

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాశ్వత ఉద్యోగుల జాబితాలో

ఔట్‌ సోర్సింగ్‌, ఆప్కాస్‌ ఉద్యోగులను చేర్చాలి

తిరుపతి ఎమ్మెల్యేకి జేఏసీ వినతి
ప్రజాశక్తి - క్యాంపస్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన శాశ్వత ఉద్యోగుల జాబితాలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, ఆప్కాస్‌ తదితర ఉద్యోగులందరినీ చేర్చాలని తిరుపతి శాసనసభ్యులు, టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి ని ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్సోర్సింగ్‌ టీచర్స్‌ అండ్‌ వర్కర్స్‌ జేఏసీ వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ గండికోట నాగ వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి , ఆనాటి ప్రతిపక్ష నేతగా వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని ప్రకటించారు.. కానీ నేటికీ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం అమలకు నోచుకోలేదున్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌, ఆప్కాస్‌, టైం స్కేలు, ఎన్‌ఎంఆర్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌ క్యాడర్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఆప్కాస్‌ ఉద్యోగులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ శాశ్వత ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని, పెన్షన్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని, సాధారణ, అనారోగ్య సెలవులు, మెడికల్‌ లీవ్‌ లు ఇవ్వాలని, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ పథకాలను కాంట్రాక్టు, పార్ట్‌ టైం, గెస్ట్‌ ఉద్యోగులందరికీ అన్ని పథకాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాస్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి.చిన్నబాబు, సిఐటియు జిల్లా నాయకులు ఎస్‌ జయచంద్ర, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుమన్‌, వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు పి.వరలక్ష్మి, చంద్రమ్మ, మునిలక్ష్మి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.