Jan 12,2022 07:15

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కదిలి సమగ్ర చక్కెర విధానాన్ని రూపొందించాలి. మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించాలి. రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించడానికి వీలుగా నిధులు కేటాయించి ఫ్యాక్టరీలను ఆదుకోవాలి. నూతన వంగడాలను ప్రవేశపెట్టడం, రైతులకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించడం... ప్రభుత్వ విధానంలో భాగం కావాలి.

    రాష్ట్రంలో సహకార స్ఫూర్తితో ఏర్పడ్డ 29 కో-ఆపరేటివ్‌ చక్కెర ఫాక్టరీలలో నేడు ఏకంగా 24 మూతబడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరుకు రైతులు, కార్మికులు రోడ్ల మీద పడాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిలో ప్రభుత్వ కో-ఆపరేటివ్‌ రంగంలో ఉన్నది గోవాడ చక్కెర ఫాక్టరీ మాత్రమే. ఒకవైపున రైతులకు, కార్మికులకు గత ఏడాది చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. క్రషింగ్‌ ద్వారా వచ్చిన పంచదార, మొలాసిస్‌ నిల్వలను అమ్ముకొని వచ్చిన నిధులను దారి మళ్లించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెరుకు రైతులు ఎదురుచూపులు చూస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకుంటానని రైతులకు, అండగా నిలుస్తానని కార్మికులకు హామీనిచ్చారు. అధికారం లోకి వచ్చాక రాష్ట్రంలో ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలన్నింటికి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించి ఆ నివేదికలైతే తెప్పించుకున్నారు. ఇది జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీలను ఆదుకునేందుకు వీసమెత్తు పని కూడా జరగలేదు. చెరుకు రైతులు తమ భార్యల పుస్తెలను సైతం తాకట్టుపెట్టి, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుండి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలకు చెరకు సరఫరా చేశారు. నేటికీ రైతులకు బకాయిలు చెల్లించకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాజానికి తీపిని అందిస్తున్న రైతుల జీవితాల్లో విషాదాలు అలుముకున్నాయి. చెరుకు పంటపై ఎక్కువగా కౌలు రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవల తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ రైతులు, కార్మికులు బకాయిలు చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. తుని మండలం సుభద్రయ్య పేటకు చెందిన కౌలు రైతు రాపేటి అర్జునరావు ఇంక రాష్ట్ర ప్రభుత్వం చెరుకు బకాయిలు చెల్లించదనే భయంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో గుండెపోటుకు గురై కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించాడు. ఇది అన్ని వార్తపత్రికల్లో ప్రధాన వార్తగా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కనీసంగా స్పందించలేదు. ఇదేనా రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ?
    విశాఖ జిల్లాలో 4 షుగర్‌ ఫ్యాక్టరీలు వున్నాయి. తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ ఇదివరకే మూతబడింది. ఈ ఏడాది ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఈ ఏడాది 48,177 ఎకరాల్లో చెరకు సాగైంది. ఇందులో 20 వేల ఎకరాలు గోవాడ పరిధిలో వుండగా, ఏటికొప్పాక, తాండవ పరిధుల్లో మూడు వేల ఎకరాలు వుంది. మొత్తంగా 23 వేల ఎకరాల చెరుకును ఫ్యాక్టరీలకు సరఫరా చేసేందుకు రైతులు ఒప్పందం చేసుకోగా, మిగిలిన 25,177 ఎకరాల చెరకుతో బెల్లం తయారు చేస్తున్నారు. నేడు అర్ధాంతరంగా తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు మూతపడడంతో ఇక్కడ పండించిన పంటను గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు ప్రభుత్వం హుకుం జారీ చేసింది. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేయడమంటే రైతుకు ఎంత భారం? పోనీ, రవాణా ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందా అంటే సమాధానం చెప్పే నాథుడే ఫ్యాక్టరీల్లో కరువాయె. అంతదూరం రవాణా భారాన్ని తట్టుకోలేక దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు.
    మన సహకార షుగర్‌ ఫ్యాక్టరీలకు రికార్డు స్థాయిల్లో క్రషింగ్‌ చేసిన ఘన చరిత్ర వుంది. ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీ 1999-2000 సంవత్సరంలో 2.84 లక్షల టన్నుల చెరకును క్రషింగ్‌ చేసింది. తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధి లోని రైతులకు రూ.8 కోట్ల 60 లక్షలు, కార్మికులకు 32 నెలల జీతాలు రూ.8 కోట్లు, ఏటికొప్పాక షుగర్‌ ఫ్యాక్టరీలో రైతులకు రూ.8 కోట్లు, కార్మికులకు 16 నెలల జీతాలు రూ.8 కోట్లు చెల్లించాల్సి వున్నా నేటికీ చెల్లించలేదు. ఒక్కొక్క ఫ్యాక్టరీకి రూ.1 కోటి 50 లక్షలు వెచ్చించి ఓవర్‌ ఆయిలింగ్‌ చేసి ఫ్యాక్టరీలను క్రషింగ్‌కు సిద్ధం చేయాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు. రైతులు, కార్మికులు మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
 

                                              ప్రభుత్వ విధానాలతో ఫ్యాక్టరీలకు నష్టం

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డబ్ల్యు.టి.ఒ (వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌) నిబంధనలకు తలొగ్గి బ్రెజిల్‌, అమెరికా నుండి ఎక్కువగా చక్కెర దిగుమతి చేసుకుంటున్నది. మన దేశంలో కేజీ పంచదార ఉత్పత్తి చేయడానికి రూ. 32 ఖర్చు అవుతుంది. ఇతర దేశాలు, ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వడంతో కేజీకి రూ.28 కే అక్కడి నుండి వస్తోంది. తక్కువ ధర కావడంతో ఎక్కువ సరుకును దిగుమతి చేసుకొని దేశీయ చక్కెర పరిశ్రమలను దెబ్బతీస్తున్నది. ఒకవైపున ఆత్మ నిర్భర భారత్‌ అని నినదిస్తూ ఇంకోపక్క స్వదేశీ కో-ఆపరేటివ్‌లను దెబ్బతీస్తున్నది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదు.
    మన రాష్ట్రంలో నూతన వంగడాలు రావడంలేదు. ఇప్పుడు వాడుతున్న వంగడాలతో రికవరీ రేటు 7 నుండి 8 శాతం మాత్రమే వుంది. దీనివల్ల రైతుకు తక్కువ ధర వస్తుంది. పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లో మేలిమి రకాలైన వంగడాలను ఉపయోగించడం వల్ల రికవరీ రేటు 14 శాతం సాధిస్తున్నారు. దీనిని సరిచేసే ప్రయత్నం ప్రభుత్వాలు చేయకపోవడంతో చెరకు పంటపై ఆధారపడి జీవిస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 

                                        స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు తూట్లు

ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం చెరుకు మద్దతు ధర టన్నుకు రూ. 5 వేలు చెల్లించాలి. కాని కేంద్రం రూ.2,900 మాత్రమే ప్రకటించింది. ఇంకోపక్క కనీస రికవరీ రేటును 8.5 శాతం నుండి 10 శాతం వరకు పెంచివేసింది. మన రాష్ట్రంలో చెరకు రికవరీ రేటు 7 నుండి 8 శాతం మాత్రమే వుండడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల్లో 14 శాతం వరకు రికవరీ రేటు వుండడం వల్ల ఆ రాష్ట్రాలకు మేలు జరుగుతున్నది. పంజాబ్‌, హర్యానా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం చెరకుకు ఇచ్చే మద్దతు ధర కంటే అదనంగా రూ.400 నుండి రూ.600 వరకు ప్రోత్సాహక ధర ఇస్తూ షుగర్‌ ఫ్యాక్టరీలను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి. కాని మన రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా షుగర్‌ ఫ్యాక్టరీలను మూసేస్తున్నది.
 

                                                         పోరాటాలతో సాధించుకుందాం

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నూతన చట్టాలపై ఏడాదిపాటు పోరాటం చేసి వాటిని తిప్పికొట్టిన చరిత్ర భారత రైతాంగానికి వుంది. అదే బాటలో రాష్ట్రంలో ఉన్న చెరకు రైతులు, ఫ్యాక్టరీల్లో పని చేస్తున్న కార్మికులు ఒకే మాట మీద నిలబడి పోరాడాలి. ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా ఏర్పడిన కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీలను రక్షించుకునేందుకు రైతులు, కార్మికులు నడుం బిగించాలి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కదిలి సమగ్ర చక్కెర విధానాన్ని రూపొందించాలి. మూతబడిన ఫ్యాక్టరీలను తెరిపించాలి. రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించడానికి వీలుగా నిధులు కేటాయించి ఫ్యాక్టరీలను ఆదుకోవాలి. నూతన వంగడాలను ప్రవేశపెట్టడం, రైతులకు అదనపు ప్రోత్సాహకాలను ప్రకటించడం ప్రభుత్వ విధానంలో భాగం కావాలి. ఈ విధానాలు అమలు లోకి వచ్చేదాకా రైతులు, కార్మికులు సమైక్యంగా పోరాటాలు సాగించాలి.
 

/ వ్యాసకర్త సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
కె. లోకనాధం

కె. లోకనాధం