రాష్ట్ర ప్రభుత్వ చర్యకు సిపిఎం ఖండన
ప్రజాశక్తి - తిరుమల
బిజెపి విశ్వహిందూ పరిషత్ లాంటి అభివద్ధి నిరోధక సంస్థల ఒత్తిడికి లొంగి రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి మున్సిపాలిటీకి టిటిడి చెల్లించాలనుకున్న ఒక్క శాతం నిధులను తిరస్కరించడంపై సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తీవ్రంగా మండిపడ్డారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థ తిరుపతి అభివద్ధికి తోడ్పడడం అనివార్యమైన చర్యగా తాము భావిస్తున్నామని నాగరాజు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొదటినుంచి తిరుపతి అభివద్ధి పట్ల వ్యతిరేకంగాను, అభివద్ధి నిరోధకంగాను వ్యవహరిస్తున్న విశ్వహిందూ పరిషత్, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ లాంటి శక్తుల వత్తిడికి లొంగిపోయి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడడం తిరుపతి ప్రజల మనోభావాలను వ్యతిరేకించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
1శాతం రద్దుచేస్తూ ఉత్తర్వులు
తిరుపతి అభివద్ధికి టిటిడి బోర్డు తీర్మానించి కేటాయించిన 1శాతం నిధులు విడుదల నిలిపివేయాలని ఆంద్రప్రదేశ్ దేవాదాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాళ్ళ వల్లవన్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు తీర్మానం రోజు కరికాళ్ళ వల్లవన్ సమావేశంలో ఉన్నా, ఆరోజు ఆమోదం తెలిపి తిరిగి రద్దు చేయడం వెనుక అంతర్యం ఏమిటనే సందేహం ప్రజల్లో వినిపిస్తుంది. బోర్డు తీర్మానం తో ప్రజల నుండి హర్షాతిరేకాలు వినపడ్డాయి. తిరిగి రద్దు చేయడం వెనుక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల కుట్ర దాగుందని ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మీడియాతో వి.నాగరాజు










