Sep 06,2023 23:58

ప్రచారం నిర్వహిస్తున్న జెవివి నాయకులు

ప్రజాశక్తి బాపట్ల : బాపట్ల జిల్లా చీరాలలో ఈ నెల 9,10 తేదీల్లో నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక 17వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జి, మురళీధర్‌ పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా బాపట్ల, కర్లపాలెం ప్రాంతాల్లో జీపు ప్రచార యాత్ర బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్‌ మాట్లాడుతూ ప్రజల్లో శాస్త్రీయ ఆలోచన విధానం మరింత పెంచేందుకు జన విజ్ఞాన వేదిక మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొట్ట మొదటిసారిగా చీరాలలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి సుమారు 500 మంది ప్రతినిధులు పాల్గొం టారన్నారు. విద్య వేత్తలు ,శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, సైన్స్‌ అభిమానులు పాల్గొంటారు. సామాన్య ప్రజలు సైన్స్‌ ఫలితాలను అందిపుచ్చుకునే విధంగా ఆలోచన పెంపొందించే దిశగా జన విజ్ఞాన వేదిక ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక 1998లో విజయవాడలో ఆవిర్భవిం చినట్లు తెలిపారు. మూడున్నర దశాబ్దాలుగా సైన్స్‌ ఆధారంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలలో బహుముఖ రంగాల్లో చైతన్యం కోసం జెవివి పనిచేస్తుందన్నారు. గతం కంటే జన విజ్ఞాన వేదిక అవసరం నేడు ఎక్కువగా ఉందన్నారు. చీరాలలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహా సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞానవేదిక నాయకులు కె. త్రిమూర్తుల రెడ్డి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు వై. భాస్కరరావు, పి.రంగారెడ్డి, టి. సుబ్బారావు, ఎస్‌కె. సుభాని, శ్రీనివాసరావు పాల్గొన్నారు.