ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : విజయవాడలో జరగనున్న ఆగష్టు 21, 22తేదీల్లో ఎపి ఎన్‌జిఒ 21వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు పెద్దఎత్తున ఉద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డివి రమణ పిలుపు నిచ్చారు. గురువారం స్థానిక ఎన్‌జిఒ భవనంలో పార్వతీపురం, కురుపాం తాలూకా యూనిట్ల ఎన్‌జిఒ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు జరుగనున్న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహ్మన్‌రెడ్డి మొదటి రోజు విచ్చేస్తారని తెలిపారు. పండుగ వాతావరణంలో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తప్పని సరిగా హాజరు కావాలని తెలిపారు. దీనికి సంబంధించి సావనీర్ విడుదల, ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రసంఘం ఇచ్చిన ఆదేశాలు మేరకు రెండు తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులతో పాటు మిగిలిన కార్యవర్గసభ్యులు దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. ఎక్కువ మంది ఉద్యోగులను కౌన్సిల్ సమావేశాలకు హాజరైనట్టు తగుచర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు. సభను విజయవంతం చేసి ఎపి ఎన్జీఓ ఐక్యతను, బలాన్ని తెలియపరచేలా ఉండాలని కోరారు. కార్యక్రమంలో విజయనగరం జిల్లా కార్యదర్శి ఆవు సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు కెబి శ్రీను, పార్వతీపురం అధ్యక్షులు జివిఆర్‌ఎస్ కిషోర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, కురుపాం తాలూకా యూనిట్ అధ్యక్షులు ప్రకాశరావు, కార్యదర్శి రామకృష్ణ, రెండు యూనిట్ల కార్యవర్గ సభ్యులు, ఎపి ఎన్జీఓ సంఘం నాయకులు పాల్గొన్నారు.










