ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్ర, జిల్లా స్థాయి క్రీడా పోటీలకు మండలంలోని మావుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన డిప్పల నవీన్ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు అండర్-17 కేటగిరీలో ఎంపికయ్యాడు. నవీన్ గిరిశిఖర గ్రామం దిగువ రూఢి చెందినవాడు. నవీన్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు కూడా ఎంపికయ్యాడు. చోడిపిల్లి రమేష్ వాలీబాల్, త్రో బాల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కొటియా గ్రామాల్లో ఒకటైన దూళిభద్రకి చెందిన విద్యార్ధి రమేష్. చోర గ్రామానికి చెందిన చోడిపిల్లి ప్రతాప్ త్రో బాల్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులకు ఐటిడిఎ ప్రత్యేక శిక్షణ ఇస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం పిఎన్ బొడ్డవలస సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీల్లో మావుడి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల హెచ్ ఎం ఎం.గుర్నాధరావు, స్కూల్ అసిస్టెంట్ ఎల్ జి సన్యాసి, డిప్యూటీ వార్డెన్ ఒ.శంకరరావు అభినందించారు.
రాష్ట్రస్థాయి క్రీడలకు గురుకులం విద్యార్థులు
గుమ్మలక్ష్మీపురం : ఈనెల 21 నుంచి గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు భద్రగిరి పిటిజి, ఎపి ఆర్ కళాశాల నుంచి పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాల నుంచి ప్రణీత, దివ్య, సంజన, కళాశాల నుంచి అరుణ, చాందిని, ఎపి ఆర్ కళాశాల నుంచి సిద్ధార్థ పోటీలకు వెళ్ళనున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. వీరు ఎంపిక కావడం పట్ల ప్రిన్సిపాళ్లు అభినందించారు.










