రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి
- ప్రభుత్వ జూనియర్ కళాశా ప్రిన్సిపల్
ప్రజాశక్తి - ఆత్మకూరు
తైక్వాండో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించి పతకాలు సాధించాలని ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బి. రఘురామ చార్యులు, పాఠశాల హెచ్‌ఎం కె.నాగరాజు, పిడి ఎండి బ్రహ్మానందం, పిఈటి దేవానంద్‌లు అన్నారు. గురువారం ఆత్మకూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది. సెప్టెంబర్ 30న కర్నూలులోని అవుట్డోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలలో అండర్-19 బాలుర విభాగం కె.మని, పి.పవన్‌లు బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను వారు అభినందించి మాట్లాడారు. తైక్వాండో విద్య ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. శారీరక, మానసిక ఒత్తడికి లోను కాకుండా తోడ్పడుతుందని, విద్య, ఉద్యోగాలలో తోడ్పడుతుందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మరెన్నో పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులను, తైక్వాండో కోచ్‌లు జి.షబ్బీర్ హుస్సేన్, ఎస్. ఖాజా హుస్సేన్‌లను ప్రిన్సిపల్ అభినందించారు. కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 9, 10, 11వ తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు సలీం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
