Aug 11,2023 20:59

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీవీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్ర ప్రజల భవిషత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిత్యం రాజీలేని పోరాటం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బీవీ.జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును విమర్శించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గతంలో టిడిపి హయాంలో ఆర్‌డిఎస్‌ ప్రాజెక్టు కోసం సుమారు రూ.1980 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. టిడిపి ప్రభుత్వం కేవలం పేపర్‌ మాత్రమే మంజూరు చేసిందని అధికారంలోకి వచ్చిన వైసిపి మంత్రులు, శాసన సభ్యులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. రివర్స్‌ టెండర్‌ పిలిచింది వైసిపి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. టిడిపి హయాంలో మంజూరు చేసిన ఆర్‌డిఎస్‌ ప్రాజెక్టును పూర్తి చేయడం చేతకాక ఈ ప్రాజెక్టు కెసిఆర్‌ పరిధిలో ఉందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రాజెక్టులను కడుతుందని తెలిపారు. వైసిపి ప్రభుత్వం మాత్రం నందవరం మండలంలో గురురాఘవేంద్ర ప్రాజెక్టు, చిలకలడోన ప్రాజెక్టుకు నీరు ఎక్కువై పరిసర పొలాలు నీటమునుగుతున్నాయని ప్రాజెక్టు కడగొమ్మును పగలగొట్టడం ఏమిటని ప్రశ్నించారు. పంటలు నీట మునుగుతుంటే రైతులకు నష్టపరిహారం అందించాలని, ప్రాజెక్టులను కూల్చడం ఏమిటని నిలదీశారు. నేటి నుంచి గోనెగండ్ల మండలంలో 'భవిష్యత్తుకు గ్యారంటీ', పల్లెనిద్ర కార్యక్రమాలు మొదలు పెడుతున్నామని తెలిపారు. మాజీ జడ్‌పిటిసి ఈరన్న గౌడ్‌, ఎల్‌ఎల్‌సి మాజీ డైరెక్టర్‌ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ సర్పంచి ఖాసీం వలీ, టిడిపి మండల నాయకులు బండే గురు స్వామి, గోపాల్‌, గురురాజ్‌ దేశారు, హాలహర్వి దావీదు, జబ్బార్‌ పాల్గొన్నారు.