రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వైసిపి లక్ష్యం - ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. గురువారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాచన్నగూడెం పంచాయతీలో ఎంఎల్‌ఎ పర్యటించారు. ఈ సందర్భంగా మారుమూల గ్రామాలైన లంకాలపల్లి, గోపాలపురం, తాటిరామన్నగూడెం గ్రామాల్లో ప్రతిగడపకూ వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లుగా ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతీకుటుంబానికి జరిగిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పలు సమస్యలను ప్రజలు ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన కుటుంబానికి రూ.పది వేలు ఆర్థిక సహాయం చేశారు.
సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన ఎంఎల్‌ఎ
నిర్వాసితకాలనీ తాట్కూరుగొమ్ము కాలనీలో సుమారు రూ.70 లక్షల నిధులతో నూతన సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఎంఎల్‌ఎ ప్రారంభించారు. అనంతరం రాచన్నగూడెం పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.పోసమ్మ, జెడ్‌పిటిసి సభ్యులు వసంతరావు, సర్పంచి సున్నం వరలక్ష్మి, సచివాలయ కన్వీనర్ వనమా రామకృష్ణ, వైస్‌ఎంపిపి సోమగని శ్రీనివాస్, ఎంపిటిసి సున్నం సురేష్, బోధ శ్రీనివాస్, సందా ప్రసాద్, బోగేశ్వరరావు, ఎంపిడిఒ కృష్ణప్రసాద్, ఎంఇఒ బుచ్చయ్య, మాజీ సర్పంచి కె.వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, కె.రాము, కుంజా రాముడు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










