రాష్టంలో జేబు దొంగల పాలన
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ తులసి రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జేబు దొంగ పాలన సాగిస్తున్నారని, ప్రజల నుండి దోచుకున్న సొమ్మును తిరిగి వారికే ఇస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ సర్రెడ్డి తులసి రెడ్డి ఘాటు వాఖ్యలు చేశారు. గురువారం నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రైతు నగరంలోని జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు జె.లక్ష్మి నరసింహ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి బిజెపి ఒక శని గ్రహంలా, వైసిపి, టిడిపిలు రాహు కేతువులుగా దాపురించాయని అన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హౌదాకు పంగనామాలు పెట్టిందని, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు స్వస్తి పలికిందని, దుగరాజపట్నం ఓడరేవు ఊసే లేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందని చెప్పారు. కేంద్రమే చేపట్టాల్సిన పోలవరంను ప్రశ్నార్ధకంగా మార్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్, విశాఖ, విజయవాడ మెట్రో రైళ్ల ఊసే లేదన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెడుతోందని, ఆంధ్రా బ్యాంకును కాలగర్భంలో కలిపేసిందని విమర్శించారు. దేశాన్ని అప్పుల భారత్ మార్చిందన్నారు. బిజెపి చేతిలో వైసిపి, టిడిపి, జనసేనలు కీలుబొమ్మలని ఆరోపించారు. బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ అన్నట్లు తయారయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదని స్పష్టం చేశారు. లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. సమావేశంలో పట్టణ అధ్యక్షులు చింతలయ్య, మైనారిటీ జిల్లా అధ్యక్షులు పఠాన్ అభిబ్ ఖాన్, మంత్రాలయం ఇంచార్జ్ బాబురావు, ఆళ్లగడ్డ సమన్వయ కర్త గంధం మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










