Nov 29,2022 23:55

ఎస్‌పి గౌతమిశాలికి ఫిర్యాదు అందజేస్తున్న నాగజగదీష్‌ తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును చంపుతానని, బెదిరించడమే కాక టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు, సిపిఐ నేత రామకృష్ణను ఇష్టానుసారం దూషించిన రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌ రెడ్డి, ఆయన తమ్ముడు చంద్రశేఖర్‌ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఎస్పీ గౌతమి శాలికి టిడిపి పార్లమెంటరీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ అధ్యక్షులు బుద్ధ నాగజగీశ్వరరావు, కార్యదర్శి లాలం కాశి నాయుడు, మాడుగుల నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి కుమార్‌, టిడిపి నాయకులు ధనాల విష్ణు చౌదరి, సూరే సతీష్‌, కోట్ని బాలాజీ, మల్ల గణేష్‌, గుర్రాల వాసు, బుద్ధ భువనేశ్వర్‌రావు, కుప్పిలి జగన్మోహన్‌, దాడి అప్పారావు, విల్లూరి రమణబాబు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న మంత్రి అమర్‌నాథ్‌
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నాగ జగదీశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అమర్నాథ్‌ మంత్రిలా కాకుండా పోలీస్‌ బాస్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు చేస్తున్న దౌర్జన్యాలపై పోలీసులు స్పందిస్తుంటే మంత్రి అమర్నాథ్‌ తనకు తెలియకుండా తమ పార్టీ నాయకులు కార్యకర్తలపై చర్య తీసుకోరాదని హుకుం జారీ చేయడం దుర్మార్గమన్నారు. భూ కబ్జాలు, ఇసుక, గ్రావెల్‌, కంకర, ప్రభుత్వ భూములు కాజేయడం వెనుక మంత్రి అమర్నాథ్‌ ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతుందన్నారు.