
విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపు
యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎపిఇసిడిసిఎల్ డిస్కం అధ్యక్షులు శ్రీనివాసరావు
ప్రజాశక్తి - భీమవరం
విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులేషన్, మీటర్ల సమస్యలు, ఉద్యోగుల పిఆర్‌సి డిమాండ్ల సాధన కోసం రానున్న కాలంలో పోరాటానికి సిద్ధపడాలని యునైటెడ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎపిఇసిడిసిఎల్ డిస్కం అధ్యక్షులు జె.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో ఆదివారం పోరాట కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఉద్యమాలకు అన్ని రకాల ఉద్యోగులు, ప్రజా సంఘాలు మద్దతు అందించాలని పోరాట కమిటీ కోరింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఐటియుసి జిల్లా నాయకులు రంగారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రారు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మాట తప్పారని విమర్శించారు. విద్యుత్‌కు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న మీటర్ రీడర్లను ముంచారన్నారు. 18 నెలల నుంచి విద్యుత్ శాఖలో ఉద్యోగులకు పిఆర్‌సి ఇవ్వకుండా చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులు, మీటర్ రీడర్లు, జెఎల్‌ఎంల సమస్యలపై ప్రభుత్వం మొండి వైఖరిని వీడనాడాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీని చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యోగులు చేసే పోరాటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగుల దశలవారి పోరాటానికి సమ్మెకు సిఐటియు, ఎఐటియుసి పూర్తి సంఘీభావాన్ని మద్దతు తెలుపుతున్నాయ ని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు మహేష్, ఎం.నాగరాజు మాట్లాడుతూ 2018లో 14 రోజుల సమ్మె సందర్భంగా అరకొర జీతాలు పెంచి సమస్య లు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి కార్మికులను మోసం చేసిందన్నారు. మీటర్ రీడర్స్ సంఘం జిల్లా నాయకులు వి.శ్రీనివాస్ మాట్లాడుతూ మీటర్ రీడర్లకు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయడంలేదన్నారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ భీమవరం డివిజన్ కార్యదర్శి సిహెచ్.కల్యాణ్‌చక్రవర్తి మాట్లాడుతూ 31వ తేదీన కలెక్టర్‌కి వినతిపత్రం, వచ్చే నెల రెండో తేదీన ఏలూరులో ధర్నా, పదో తేదీన ఎపి డిసిఎం విశాఖపట్నంలో నిర్వహించే ధర్నాలో ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే ఏ సమయంలోనైనా సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు ఆంజనేయులు, విద్యుత్ ఉద్యోగ సంఘ నాయకులు తిరుపతయ్య, పవన్‌కల్యాణ్, శేఖర్, రమణ, సత్యనారాయణ, సుభాష్ చంద్రబోస్, సుబ్రహ్మణ్యస్వామి పాల్గొన్నారు.