Jan 25,2023 23:56

మాట్లాడుతున్న వైసిపి నేత వైవి.సుబ్బారెడ్డి

ప్రజాశక్తి- చోడవరం
రానున్న ఎన్నికల్లో గెలిపి లక్ష్యంగా ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త, గృహసారథులు, కన్వీనర్లు పనిచేయాలని ఆ పార్టీ ఉమ్మది విశాఖ, అనకాపల్లి జిల్లాల కో-ఆర్డినేటర్‌, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చోడవరం నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శివాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష టిడిపి తమ సొంత మీడియాతో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేస్తుందన్నారు. 2024 లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరల వైసిపి అధికారంలోకి రావడానికి అందరూ కృషి చేయాలన్నారు. చోడవరంలో ఉన్న మూడు దేవాలయాలతో పాటు వడ్డాది వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. చోడవరం సుగర్‌ ఫ్యాక్టరీని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అనంతరం గెస్ట్‌ హౌస్‌లో కార్యకర్తల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. నిర్మొహమాటంగా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. చోడవరం నియోజకవర్గంలో మెయిన్‌ రోడ్డు పనులు నత్త నడిపిన సాగుతున్నాయని సుబ్బారెడ్డి దృష్టికి పలువురు కార్యకర్తలు నాయకులు తీసుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన కాంట్రాక్టర్‌ను పిలిపించి పనులు వేగవంతం చేస్తామని లేకుంటే కాంట్రాక్టు రద్దు చేసి మరొకటి అప్పగించి మూడు నెలల్లో రోడ్డు పనులు పూర్తయ్యాలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి మాట్లాడుతూ కార్యకర్తలు ప్రభుత్వానికి అండగా ఉండి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, జడ్పీ చైర్‌ పర్సన్‌ సుభద్ర, వైసిపి నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, ఎంపీపీలు గాడి కాసు, కే శ్రీనివాసరావు, నాగేశ్వరి దేవి, రాజు, జడ్పిటిసిలు దొండ రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేతలు కష్టించి పని చేయాలి
నర్సీపట్నం టౌన్‌ : స్థానిక వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించు కోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. మన ప్రభుత్వం రాకముందు ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దగ్గరుండి చూశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99.5శాతం పూర్తి చేశారని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. దేశంలో మరెక్కడా ఏ రాష్ట్రంలోని జరగని అభివృద్ధి మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కరణం ధర్మశ్రీ, జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ జల్లు సుభద్ర, నర్సీపట్నం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఆదిలక్ష్మి, నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, మకవరపాలెం ఎంపీపీ సత్యనారాయణ, గొలుగొండ ఎంపీపీ మణికుమారి, జడ్పిటిసి సుల వెంకట గిరిబాబు, నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మిమూర్తి, పెట్ల సత్యవేణి పాల్గొన్నారు.