ప్రజాశక్తి-బాపట్ల: పురుషులకు ధీటుగా నారీమణులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ తెలిపారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతున్నారు. అయితే ఆడపిల్ల అంటే ప్రతి ఒక్కరూ చిన్నచూపు చూస్తున్నారు. గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలిస్తే రూపుమాపేందుకు సైతం వెనుకాడడం లేదు. కుటుంబాల్లో ఆయా పరిస్థితులు ఎదురైతే మహిళలు సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది. ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని ఖండించగలిగే స్థాయికి మహిళలు ఎదగాలి. పాఠశాలల్లో చదువుకునే బాలికల సంఖ్య పెరగాలి. డిగ్రీ వరకు ఆడపిల్లను చదివించగలిగితే సమాజంలో మహిళల పట్ల నెలకొని ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేందుకు ఎంతో దోహదపడుతుంది. ప్రతి మహిళకు సమాజం అండగా నిలవాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు అంతరించే దశకు చేరడం వల్లే మహిళలకు ఓదార్పు తగ్గింది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపగలిగితే కుటుంబం, సమాజ వ్యవస్థలో ఎన్నో మంచి మార్పులను చూడొచ్చు.
మహిళలపై వేధింపు నిరోధక కమిటీ ఏర్పాటు చేశాం
జిల్లాలో మహిళలపై జరుగుతున్న అనేక వేధింపులను నిరోధిం చేందుకు జిల్లాలో వేధింపు నిరోధక కమిటీని ఏర్పాటు చేశాం. బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మహిళ కావడంతో ఈ కమిటీని పకడ్బందీగా నిర్వహించేందుకు కృషి జరుగుతోంది. అతివలు స్వతహాగా తమ హక్కుల సాధనకు నడుం కట్టిననాడే సమాజంలో అనుకున్న మార్పునకు శ్రీకారం చుట్టగలం. దానికి సమాజం సహకరించాలి. ప్రతి మహిళ ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడే మహాత్మాగాంధీ కన్న కలలకు సార్ధకత చేకూరుతుంది.
బాల్యవివాహాల నిర్మూలనకు వివాహ రిజిస్ట్రేషన్ పద్ధతి
కులమతాలకు అతీతంగా ఏ సామాజిక వర్గమైనా వివాహానికి ముందే వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెళ్లిళ్లు జరిగే విధంగా చట్టం చేస్తేనే బాల్యవివాహాలను నిర్మూలించగలం. బాల్య వివాహాలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న వయసులోనే ఆడపిల్లలు గర్భం దాల్చడం, పుట్టిన పిల్లలు అనేక రుగ్మతల బారిన పడడం జరుగుతోంది. దీంతో చిన్న వయసులోనే ఆడపిల్లలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని నిరోధించటానికి వివాహ రిజిస్ట్రేషన్ ఏకైక మార్గం.
జిల్లాలో మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత
జిల్లాలో 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 12 అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామీణ పట్టణ మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నాం. ఇంకా జిల్లాలో 14 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. జిల్లాలో వీటి ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందించే వైద్య సేవలను సత్వరమే అందిస్తున్నాం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ మహిళా కార్మికులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి సత్వరమే వైద్య సహాయం పొందాలని విజయమ్మ కోరారు. బాలికల సంరక్షణ వారి చదువుపట్ల మరింత శ్రద్ధ కనబరిచి సమాజ హితానికి, బాలికా సంరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని ఆమె పిలుపునిచ్చారు.










