
రాణి పేటకు చీకటే దారి!
- రాత్రి వేళలో వెళ్లాలంటే గుండెల్లో గుబులు
- విద్యుత్ దీపాలకు కరువైన మున్సిపాల్టీ
- పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి -గూడూరు: గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో విద్యుత్ దీపాలు లేక చీకట్లోనే రాకపోకలు సాగాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా గూడూరు పాత బస్టాండ్ నుండి రాణి పేట మొదటి వీధికి వెళ్లాలంటే మహిళలు, చిన్నపిల్లలు భయందోళనతో వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ద్విచక్ర వాహనదారులు విద్యుత్ దీపాలు లేనందు వల్ల పాదచారులు, ప్రజలు కనిపించక పోవడంతో అనేక ప్రమాదాలు జరుగు తున్నాయి. ముఖ్యంగా ఆ మార్గంలో రాత్రి వేళల్లో అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకింగ్ చేసేవాళ్లు, చర్చికి ప్రార్థనలకు వెళ్లేవారు, అమరావతి హాస్పిటల్, మార్కెట్‌కి వెళ్లే వాళ్లు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని నడవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగాలు చేసుకునే మహిళలు, యువతులు రాత్రి 8 గంటల తర్వాత వారి ఇళ్లకు ఆ దారిన వెళ్లాలంటే ఏ ప్రమాదం ముంచుకొస్తోందనే భయం వారిని వెంటాడుడుతోంది. వీధి దీపాలు లేకపోవడంతో మద్యం ప్రియులు మద్యం తాగి, అసాంఘిక కార్యలాపాలకు నిలయంగా మారింది. దగ్గరికి వెళ్లే వరకు ఆ దారిలో ఎవరూ కనిపించక పోవడం, ఆ తర్వాత ఏ ప్రమాదం సంభవిస్తుందోననే భయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. వీధి దీపాలు లేక అంధకారంలోనే రాకపోకలు సాగాల్సి వస్తోందని గూడూరు మున్సిపల్ కమిషనర్‌కు, అధికారు లకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజ నం శూన్యంగా ఉందని ఆ ప్రాంత వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయం కూడా ఆ ప్రాంతానికి సమీపంలో ఉండడం విశేషం. ఇప్పటికైనా గూడూరు మున్సిపల్ ప్రత్యేక అధికారి, ఆర్డీవో జోక్యం చేసుకొని తమ ప్రాంతంలో వీధిలైట్లు ఏర్పటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.