
ప్రజాశక్తి-పరవాడ
మండలంలో తానాం పక్కన ఫార్మాసిటీ రాంకీ యాజమాన్యం అక్రమంగా తవ్విన చెరువును మూసివేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో చెరువు వద్ద సోమవారం స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాంకీ యాజమాన్యం పర్యావరణాన్ని నాశనం చేస్తూ గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో చెరువు తవ్వి ఫార్మా వ్యర్థ రసాయనాలను నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేసిందని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ చెరువును నిలిపివేశారని పేర్కొన్నారు. రాంకీ యాజమాన్యం దొంగచాటుగా కాలువలు తవ్వి చుట్టూ ఉన్న చెరువుల్లో వ్యర్థ రసాయలను విడిచిపెడుతుందని, మూసివేయాల్సిన చెరువులో రసాయలను వదిలేస్తుందని విమర్శించారు. దీనివల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. కాలుష్యం నుంచి చుట్టూ ఉన్న గ్రామాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వి సన్యాసిరావు, నర్సింగరావు, అప్పారావు, కన్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు