Nov 13,2022 22:58

నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌ కంపెనీ ప్రతినిధులు

ప్రజాశక్తి-రాంబిల్లి :అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో యమ ఇండియా రిబ్బన్‌ కంపెనీ నిర్మాణ పనులకు ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, సెంట్రల్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ డైరెక్టర్‌ అనీల్‌ కుమార్‌, అనకాపల్లి ఎంపీ బీసెట్టి వెంకటసత్యవతి, యలమంచిలి ఎమ్మెల్యే ఉప్పలపాటి వెంకటరమణమూర్తిరాజు, చైనీస్‌ ఎంబసీ న్యూఢిల్లీ సెక్రటరీ యు యాంగ్‌, డబ్ల్యూయు జూన్‌ నిమి, ఎపిఐఐసి ప్రతినిధి ఎం.త్రినాధరావు, చైనా జనరల్‌ కాన్సులేట్‌ జహ లీయూ (కోల్‌కతా), యమ రిబ్బన్‌ ఇండియా డైరెక్టర్‌ స్టీవ్‌ హాజరై మాట్లాడారు. యమ రిబ్బన్‌ గ్రూప్‌ ప్రపంచంలోనే అతిపెద్ద రిబ్బన్లు, బౌస్‌ తయారీ సంస్థ అని తెలిపారు. రూ.300 కోట్ల పెట్టుబడితో 2000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. కొత్త యూనిట్‌లో ఎక్కువగా మహిళలే ఉంటారని తెలిపారు. స్థానికులకు ఉద్యోగ ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఉత్పత్తులను యుఎస్‌, యూరోపియన్‌ మార్కెట్‌కు ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. కంపెనీ అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు యమ ఇండియా కంపెనీ డైరెక్టర్‌ స్టీవ్‌ ధన్యవాదాలు తెలిపారు. 2023 డిసెంబరు నాటికి ట్రయల్‌ ఉత్పత్తిని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ డైరెక్టర్‌ శివప్రసాద్‌, కంపెనీ మేనేజర్లు క్రాంతి కుమార్‌, శివ, జగన్‌, మోహన్‌, రవి, రామసురేష్‌, అశోక్‌, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.