ప్రజాశక్తి - ఎటపాక
అమరజీవి ఇరపా శ్రీరాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రబోరులో సిపిఎం మండల కార్యదర్శి ఐవి అధ్యక్షతన శ్రీరాములు వర్ధంతి సభ జరిగింది. తొలుత శ్రీరాములు స్థూపం వద్ద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణానికి, ప్రజాసేవకు శ్రీరాములు నిబద్ధతతో కడవరకు కృషి చేశారని కొనియాడారు. ఒడిదుడుకులు ఎన్ని వచ్చిన మౌలిక వసతులు కల్పించడంలో సమితి ప్రెసిడెంట్‌గా తన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించారని గుర్తు చేశారు. ఏజెన్సీలో పనిచేసిన సిపిఎం ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవకే అంకితం అయ్యారని, ఆ అమరుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను కాజేస్తూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బిజెపి దేశంలో అలజడులు సృష్టిస్తుందని విమర్శించారు. బిజెపి విధానాలను ప్రతిఘటిస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా సీపీఎం నికరంగా నిలబడి పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఐ.పద్మ, ఇరపా అజరు, ఇరపా సత్యం, కారం జయమ్మ, జి.హరి, సుధాకర్, శ్రీను, ప్రవీణ్, కన్నయ్య, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.










