రామకృష్ణాపురంలో అగ్రవర్ణాల కులాహంకారం
˜దళితులను ఆలయంలోకి రాకుండా తాళం
˜బయటే పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్న ఎస్సీలు
˜అధికారుల చర్యలు అంతంతమాత్రం
ప్రజాశక్తి- పుత్తూరుటౌన్
తిరుపతి జిల్లా పుత్తూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలోని దళిత కుటుంబాలు నేటికీ వివక్షతకు గురవుతూనే ఉన్నారు. గ్రామంలోని జరుగుతున్న పోలాక్షమ్మ అమ్మవారి ఉత్సవాలల్లో దళితుల ప్రవేశం లేకుండా కులాహంకారంలో అదే గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారు. ఉత్సవాలలో ఆలయంలోకి ప్రవేశం లేకుండా తరచూ వివక్ష చూపుతున్నారు. శనివారం దళిత కుటుంబాల వారు ఆలయంలో అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు ఆలయానికి చేరుకోగానే అగ్రవర్ణాలకు చెందిన వారితోపాటు ఆలయ పూజారి సైతం ఆలయానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలని ఆలయం వద్దనే నిరసనకు దిగారు. గత మూడు నెలలుగా దళితహక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశులు ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నా.. అగ్రవర్ణాల కులాహంకారంతో దళితులను ఆలయ ప్రవేశం చేయకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ఆదివారం పోలక్షమ్మ అమ్మవారిని చుట్టుపక్కల ఏడు గ్రామాల్లో ఊరేగింపు అనంతరం రామకష్ణాపురం దళితవాడకు రావాల్సి ఉండగా కులవివక్షతో రాకుండా ఆలయ కమిటీ ఛైౖర్మన్ అడ్డుకోవడం దారుణమని వాపోయారు. గ్రామానికి పూర్వకాలం నుంచి వస్తున్న గ్రామదేవత ఊరేగింపు ఆదివారం రాకపోయేసరికి గ్రామస్తులు ఏం కీడు జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని గ్రామస్థులు తెలిపారు. అనంతరం తహశీల్దారు పరమేశ్వరస్వామి, పుత్తూరు ఎస్సై వెంకట మోహన్‌లకు వినతిపత్రాలు అందించారు. మండల కేంద్రం పుత్తూరులోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో దళిత, గిరిజన జిల్లా అధ్యక్షులు వై నందయ్య, గోపి, బాబి, సాయికిరణ్, సత్యవేడు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్‌ఛార్జి ధన, గ్రామస్తులు గజపతి, మనోహర్, భాస్కర్, చక్రపాణి, మునెయ్య, హరికష్ణ, దేశమ్మ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి
రామకృష్ణాపురం పంచాయతీలోని పోలాక్షమ్మ అమ్మవారి ఆలయంలో దళితుల ప్రవేశాన్ని అడ్డుకోవడం.. ఆలయానికి తాళాలు వేయడం దారుణమని.. అడ్డుకుంటున్న ఆలయ కమిటీ ఛైర్మన్‌తోపాటు అగ్రవర్ణాలపై వెంటనే పుత్తూరు డీఎస్పీ స్పందించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. అగ్రవర్ణాల వారు దళితుల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం చూస్తే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమాన పరిచినట్లే. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కులమతాలకు అతీతంగా నేడు సమాజం ముందుకెళుతుంటే ఇలాంటి చీడపురుగులపై వెంటనే చర్యలు తీసుకోకుంటే ప్రమాదకరం. చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలను ఏకం చేసి పోరాటం ఉద్ధృతం చేస్తాం.
- గూళూరు కరుణ, పుత్తూరు సీనియర్ దళిత నాయకుడు










