May 11,2023 19:53

ఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న కెవిపిఎస్‌ నాయకులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
మండలంలోని అగ్రహారం గ్రామంలో దళితుల కోసం తహశీల్దారే రెండు నెలల క్రితం కేటాయించిన స్థలం చుట్టూ వేసుకున్న ఇనుప కంచెను పీకి, అందులో పాతుకున్న అంబేద్కర్‌ చిత్రపటంతో కూడిన పోల్‌కు సిమెంట్‌ అంటించి అవమానపరిచిన రామేశ్వర రెడ్డి కుటుంబంపై అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం గోనెగండ్ల ప్రభుత్వాస్పత్రి వద్ద బి.అగ్రహారం దళిత కుటుంబాలతో కలిసి కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.ఆనంద్‌ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్‌లు ఎస్‌ఐకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సచ్చేదాకా అవమానాలు పడుతూ బతికే దళితులు, సచ్చిన తర్వాత కూడా పూడ్చేందుకు ఆరడుగుల స్థలం లేక నిరంతర అవమానాలు పడుతూనే ఉన్నారని తెలిపారు. మండలంలోని బి.అగ్రహారం గ్రామంలో శ్మశాన స్థలం లేని దళితులు గత రెండు నెలల క్రితం దళితుడైన రాజశేఖర్‌ చనిపోయిన సందర్భంగా శ్మశానం కోసం పోరాడి తహశీల్దార్‌ చేతనే 44 సెంట్ల భూమిని శ్మశాన వాటిక కోసం కేటాయింపు చేయించుకున్నారన్నారు. శ్మశానం పక్కనే 30 ఎకరాల భూమి ఉన్న రామేశ్వర రెడ్డి, అది చాలక దళితులకు కేటాయించిన శ్మశాన భూమిని సైతం కబ్జా చేశారని తెలిపారు. దళితులంతా రూపాయి, రూపాయి పోగేసుకుని శ్మశానం చుట్టూ నిర్మించుకున్న ఇనుప కంచెను సంపూర్ణంగా తీసేసి, శ్మశానంలో పూడ్చుకున్న అంబేద్కర్‌ చిత్రపటంతో కూడిన బోర్డుకు బురదనటించిన రామేశ్వర్‌ రెడ్డి, లక్ష్మీదేవి, మారుతీ రెడ్డిపై అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తన పొలానికి పోతూ ఘటనను గమనించిన మాలముని, అక్కడికి వచ్చిన గోపాల్‌, వెంకట రాముడులు ఎందుకు ఇలా చేశారని అడిగినందుకు కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారన్నారు. దళితులకు సంబంధించిన శ్మశానం తమ చుట్టూ ఉండకూడదనే కుల దురహంకారంతో, అందులో పాతిన అంబేద్కర్‌ చిత్రపటానికే సిమెంటు పూసి అవమానించే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని మండిపడ్డారు. కేటాయించిన స్థలానికి సంపూర్ణమైన హక్కు కల్పించకుండా నిందితులకు తహశీల్దార్‌ సహకరిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. నిన్న రాత్రి 10 గంటల వరకు ఉన్న కంచె, పొద్దు పొడిచే నాటికి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అంబేద్కర్‌ను అవమానించి, అంబేద్కర్‌ బోర్డును తీసి వేస్తూ తిరిగి బోర్డు ఎలా పాతుతారని నిలదీశారు. ఘటనకు కారణమైన రామేశ్వర్‌ రెడ్డి, లక్ష్మీదేవిని, అందుకు సహకరించిన గిరీశ్వర్‌ రెడ్డి, మారుతి రెడ్డి, రాఘవేందర్‌ రెడ్డిపై అట్రాసిటీ కేసును నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. లేకపోతే చలో అగ్రహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం అగ్రహారం గ్రామ దళితులతో కలిసి గోనెగండ్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అగ్రహారం దళితులు బజారి, గిరిరాజు, వంశీకృష్ణ, దస్తగిరి, ఓబులేసు, మునిస్వామి మరో 20 మంది పాల్గొన్నారు.